ఇండోనేషియాలో భూకంపం: 6.4గా తీవ్రత నమోదు, నివాసాలను వదిలి జనం పరుగులు
ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్‌లోని తనింబర్ దీవుల్లో గురువారం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
జకార్తా: ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవలే టర్కీ-సిరియాలో పెను భూకంపం వేలాది మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. మరోసారి సిరియాలో భూకంపం సంభవించింది. తాజాగా, ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్‌లోని తనింబర్ దీవుల్లో గురువారం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
భూకంప కేంద్రం 97 కిలోమీటర్లు(60.27మైళ్లు) లోతులో ఉన్నట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. అయితే, సునామీ వచ్చే అవకాశం ఏమీ లేదని పేర్కొంది. భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో నివాసాల నుంచి జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.
సిరియాలోనూ తాజాగా మరో భూకంపం
వాయువ్య సిరియాలోని ఇబ్లిబ్ ప్రావిన్స్ లో గురువారం రాత్రి 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం 10.47 గంటలకు సంభవించిన భూకంప కేంద్రం 18.8 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇది నేమ్ సేక్ ప్రావిన్స్ రాజధాని ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సిరియా రాజధాని డమాస్కస్, ఉత్తర ప్రావిన్స్ అలెప్పోలో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భూకంపం కారణంగా తీర ప్రాంత ప్రావిన్స్‌లోని స్థానిక ప్రజలు తమ భవనాల గోడల నుంచి దుమ్ము పడిపోవడాన్ని గమనించి భయంతో వెంటనే వీధుల్లోకి పరుగులు తీశారు. కొందరు ఫోన్ ద్వారా వార్తల సంస్థలకు తెలియజేశారు.
ప్రకంపనల తర్వాత అనేక మంది సిరియా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. మళ్లీ ప్రకంపనలు చోటుచేసుకుంటాయనే భయంతో గంటలపాటు వీధుల్లోనే గడిపారు. అయితే, తాజా భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభించలేదని సమాచారం.
కాగా, ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో 7.7 సంభవించిన భారీ భూకంపంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 41వేల మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. వేల సంఖ్యలో క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు దేశాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మృతదేహాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications