"మిస్టర్ బీస్ట్" ప్రపంచ రికార్డ్.. 500 మిలియన్ సబ్‌స్క్రైబర్స్
ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొంది, నంబర్ వన్ యూట్యూబర్‌గా వెలుగొందుతున్న మిస్టర్ బీస్ట్ (MrBeast) సరికొత్త రికార్డు సృష్టించారు. యూట్యూబ్‌లో ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) మంది సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటిన మొట్టమొదటి క్రియేటర్‌గా నిలిచారు. గతంలో ఎవరూ అందుకోలేని ఈ అపూర్వమైన రికార్డును జూన్ 12, 2026 నాటి ప్రత్యక్ష ప్రసారం (లైవ్) లో ఆయన అధికారికంగా అధిగమించారు.
మిస్టర్ బీస్ట్ అసలు పేరు జేమ్స్ డోనాల్డ్‌సన్ కాగా, ఆయన 2012 ఫిబ్రవరిలో కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే తన యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. 2017లో ఒక ప్రత్యేక వీడియోలో ఆయన ఒకటి నుండి లక్ష వరకు అంకెలను లెక్కిస్తూ చేసిన వినూత్న ప్రయోగం భారీగా ఆకట్టుకుంది. ఆ వీడియో తెచ్చిన విశేష ప్రజాదరణే ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా స్టార్‌గా మార్చింది.

మిస్టర్ బీస్ట్ సామాజిక సేవలు
తాను ఆర్జించే అమితమైన ప్రజాదరణ, సంపదను మిస్టర్ బీస్ట్ నిరుపేదల కోసం వెచ్చిస్తున్నారు. ఆయన నిర్వహిస్తున్న 'బీస్ట్ ఫిలాంత్రపీ' ఛానల్ నుండి వచ్చే పూర్తి ఆదాయాన్ని సేవకే కేటాయిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోట్లాది మొక్కలు నాటడం, సముద్రాలను శుభ్రం చేయడం వంటి ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా ఈ ఛానల్ ద్వారా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
నిరుపేదలకు సాయమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన, 'లైట్ ఏఐ' ప్రాజెక్టును ప్రారంభించారు. దీనితో కృత్రిమ మేధస్సు (ఏఐ) జోడింపుతో నిరుపేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపిస్తున్నారు. అలాగే 'ఘనా మేక్ ఏ డిఫరెన్స్' అనే సేవా సంస్థ సహాయంతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్న పిల్లల శస్త్రచికిత్సల కోసం అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన సర్జికల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న కెన్యా, జింబాబ్వే మరియు ఉగాండా దేశాల్లో ప్రతీ గ్రామంలో దాహార్తిని తీర్చడానికి వందకు పైగా మంచినీటి బావులను తవ్వించారు. బాలకార్మికులుగా మగ్గిపోతున్న చిన్నారుల జీవితాల్లో ఆయన వెలుగులు నింపారు. ఈ సేవా కార్యక్రమాల వీడియోల ద్వారానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఏర్పడ్డారు.
మిస్టర్ బీస్ట్ సాధించిన ఈ అరుదైన ఘనత ఆయనలోని సేవా గుణానికి చిహ్నం. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ రికార్డు యూట్యూబ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. సమాజ హితం కోరుతూ సాగుతున్న ఆయన ప్రయాణంలో సాధించిన ఈ 50 కోట్ల సబ్‌స్క్రైబర్ల విజయం డిజిటల్ కంటెంట్ సృష్టించే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది.












Click it and Unblock the Notifications