Afghanistan: కాబూల్‌లో రాకెట్ దాడులు-తిప్పికొట్టిన అమెరికా-డెడ్ లైన్ దగ్గరపడటంతో టెన్షన్... టెన్షన్...
కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం(ఆగస్టు 30) విమానాశ్రయంపై మరోసారి రాకెట్ దాడులు జరిగాయి. ఖొర్షిద్ ప్రైవేట్ యూనివర్సిటీ సమీపంలో ఓ వాహనం నుంచి ఉగ్రవాదులు ఈ రాకెట్లను ప్రయోగించారు. అమెరికా భద్రతా దళాలు ఈ దాడులను తిప్పికొట్టాయి. విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి దాడిని భగ్నం చేసిన మరుసటిరోజే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంటే... ఉగ్రవాదులు మరింత మారణహోమం సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా దాడులపై స్థానిక జర్నలిస్ట్ ఏమన్నారంటే...
తాజా రాకెట్ దాడులకు సంబంధించి ఆఫ్గనిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ ఒకరు ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు.'కాబూల్‌లోని లాబ్ ఇ జార్ ప్రాంతం నుంచి కనీసం రెండు రాకెట్లను ప్రయోగించారు. ఉదయం 6.40గంటల సమయంలో ఇది చోటు చేసుకుంది. సమీపంలోని ఆర్య టౌన్‌షిప్ రూఫ్ టాప్‌పై ఆ రాకెట్లు పడినట్లు స్థానికులు చెప్పారు.' అని ఆ జర్నలిస్ట్ వెల్లడించారు. రాకెట్ దాడితో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుపోయింది. దాడి జరిగిన వేళ భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు.

ఆ రెండూ ఒక్కటేనా..?
కాబూల్ విమానాశ్రయం వద్ద ఆదివారం(ఆగస్టు 29) ఆత్మాహుతి దాడులను అమెరికా బలగాలు చేసిన సంగతి తెలిసందే. దాడులకు పాల్పడేందుకు ఆత్మాహుతి దళ సభ్యులు ఓ వాహనంలో దూసుకొస్తున్న సమయంలో.. అమెరికా వైమానిక దళం దానిపై దాడులు జరిపింది.అత్యాధునిక డ్రోన్ సాయంతో గురి తప్పకుండా దాన్ని పేల్చేసింది. విమానాశ్రయానికి సమీపంలోనే ఆదివారం రాకెట్ దాడి కూడా జరిగింది. ఈ దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ దాడి ఎవరు చేశారనేది తెలియలేదు. అమెరికా జరిపిన డ్రోన్ దాడి,రాకెట్ దాడి రెండూ ఒకటేననే వార్తలు కూడా వచ్చాయి.

రేపే అమెరికా డెడ్ లైన్... సర్వత్రా ఉత్కంఠ...
ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. రేపటితో(ఆగస్టు 31) అమెరికా డెడ్ లైన్ ముగుస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈలోపు ఉగ్రవాదులు మరిన్ని దాడులకు తెగబడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 31 లోపు తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గడువును పొడగించాలని బ్రిటన్ సహా పలు దేశాలు కోరినప్పటికీ బైడెన్ అందుకు అంగీకరించలేదు. అటు తాలిబన్లు కూడా డెడ్ లైన్ దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. దీంతో తరలింపు ప్రక్రియను అమెరికా వేగతవంతం చేసింది. అమెరికా అక్కడి నుంచి నిష్క్రమిస్తే మిగతా దేశాలకు తరలింపు ప్రక్రియ అసాధ్యమనే చెప్పాలి. ప్రస్తుతం విమానాశ్రయం అమెరికా,నాటో దళాల నియంత్రణలో ఉండటంతో తరలింపు సాధ్యపడుతోంది. అమెరికా నిష్క్రమణ తర్వాత అది తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లనుంది.

ఆష్రఫ్ ఘనీనే దీనంతటికి కారణం...
కాబూల్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ కారణమని తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ పేర్కొన్నారు. నిజానికి తాము శాంతియుతంగా అధికార మార్పిడి కోరుకున్నామని... కానీ ఆష్రఫ్ ఘనీ చెప్పా పెట్టకుండా దేశం వీడి పారిపోయారని అన్నారు. ప్రభుత్వాన్ని అలా వదిలేసి వెళ్లి ఘనీ తప్పు చేశారని అన్నారు. ఈ కారణంగా ఆఫ్గనిస్తాన్‌లో ఒకరకమైన శూన్యత ఏర్పడి... అది కాల్పులకు,దోపిడీకి దారితీసిందన్నారు. ఆష్రఫ్ ఘనీ గనుక కోట్ల కొద్ది డబ్బుతో పారిపోవడం నిజమే అయితే... ఆ డబ్బును తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు ఇవ్వాల్సిందేనన్నారు. అది ప్రజల డబ్బు అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తమ ప్రాధాన్యత అది కాదని... ప్రభుత్వ ఏర్పాటు పైనే తమ ఫోకస్ ఉందని చెప్పారు.

యూఏఈతో తాలిబన్ల సంబంధాలు...
ఆష్రఫ్ ఘనీకి యూఏఈ ఆశ్రయం ఇచ్చిందన్న ప్రచారంపై సుహైల్ షహీన్ స్పందించారు. ఘనీకి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అంతమాత్రాన యూఏఈతో తాలిబన్లకు సంబంధాలు లేవని కాదన్నారు. తమకు యూఏఈతో,ఖతర్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తమ కార్యాలయం ఖతర్‌లోనే ఉందన్నారు. ఆష్రఫ్ ఘనీకి యూఏఈ ఆశ్రయం కల్పించడం వారి విధానాలను తెలియజేస్తోందన్నారు.కాబూల్‌లో ఐసిస్ ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని సుహైల్ షహీన్ పేర్కొన్నారు. సరైన డాక్యుమెంట్స్ లేని ఆఫ్గనిస్తానీలను విమానాశ్రయం లోపలికి అనుమతించట్లేదని అన్నారు.
Recommended Video

అమెరికా నిష్క్రమణ తర్వాత తాలిబన్లు మరింత రెచ్చిపోయే ప్రమాదం
ఇటీవల కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 200 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో 13 మంది అమెరికన్ సైనికులు కాగా మిగతావారు ఆఫ్గనిస్తానీలు. దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించుకుంది. విమానాశ్రయంపై దాడి జరిగే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించిన మరుసటిరోజే ఈ దాడులు చోటు చేసుకున్నాయి. అసలే తాలిబన్ల అరాచకాలతో ఆఫ్గనిస్తాన్ అతలాకుతలమవుతున్న వేళ... ఐసిస్ కూడా వారికి తోడవడం మరింత విధ్వంసానికి కారణమవుతోంది. ఇప్పటికీ వేలాది మంది ఆఫ్గనిస్తానీలు విమానాశ్రయానికి చేరుకుంటూనే ఉన్నారు. అయితే వారందరినీ దేశం దాటించడం అసాధ్యమనే చెప్పాలి. చాలామంది నిరాశతో వెనుదిరిగిపోతున్నవారు కూడా ఉన్నారు. భౌగోళిక సరిహద్దుల ద్వారా దేశం దాటేందుకు వేలాది మంది ప్రయత్నిస్తున్నారు. అయితే సరిహద్దు దేశాలు బోర్డర్స్‌ను మూసివేయడంతో ఆ అవకాశం లేకుండా పోయింది.పాకిస్తాన్ బోర్డర్ వద్ద వేలాది మంది పడిగాపులు కాస్తున్న వీడియో ఒకటి ఇటీవల వెలుగుచూసింది. బోర్డర్‌ను తెరవాలని... తమకు పాకిస్తాన్‌లోకి ప్రవేశం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 31న అమెరికా నిష్క్రమణ తర్వాత ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు మరింత శృతి మించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications