ఉత్తరకొరియా అధినేతగా "కిమ్" బై బై చెప్తారా.. కిమ్-జు-యే మళ్లీ ఎంట్రీ ??
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్-జు-యే మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశమైన "కుమ్‌సుసన్ సన్ ప్యాలెస్ ఆఫ్ ద సన్"ను సందర్శించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉత్తర కొరియా అధికారిక మీడియా ద్వారా విడుదల కావడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
కుమ్‌సుసన్ సందర్శనపై రాజకీయ చర్చ..
కాగా కుమ్‌సుసన్ స్మారక ప్రదేశం ఉత్తర కొరియా రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఇక్కడే దేశ స్థాపకుడు కిమ్ ఇల్-సంగ్, మాజీ అధినేత కిమ్ జోంగ్-ఇల్ భౌతిక అవశేషాలు భద్రపరచబడి ఉన్నాయి. ఇలాంటి పవిత్రమైన ప్రదేశానికి కిమ్-జు-యేను తీసుకెళ్లడం ఆమెను వంశపారంపర్య నాయకత్వానికి సిద్ధం చేస్తున్నారనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మూడేళ్లుగా కిమ్-జు-యే..
గత మూడేళ్లుగా కిమ్-జు-యే తన తండ్రి కిమ్ జోంగ్ ఉన్‌తో కలిసి పలు కీలక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. నూతన సంవత్సర నివాళుల కార్యక్రమాలు, ముఖ్య జాతీయ వేడుకలు, అంతర్జాతీయ స్థాయి పర్యటనలు వంటి సందర్భాల్లో ఆమె తరచూ కనిపిస్తున్నారు. దీంతో ఆమె వ్యవహారం రాజకీయంగా సైతం హాట్ టాపిక్ అవుతోంది.
2022లో తొలిసారి పరిచయం..
కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను తొలిసారిగా 2022లో ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత 2023లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్యాంగ్యాంగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె కనిపించడం వారసత్వంపై చర్చలకు మరింత ఊపునిచ్చింది. ఆ తర్వాత గత ఏడాది చైనా సంబంధిత పర్యటనలో కూడా కిమ్-జు-యే పాల్గొనడం గమనార్హం. దీంతో కిమ్ ఆమెను భవిష్యత్ నాయకురాలిగా మార్చే పనిలో ఉన్నారా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దక్షిణ కొరియా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో రెండో సంతానం కిమ్-జు-యే. ఇప్పటికే ఆమెకు ప్రోటోకాల్ పరంగా ప్రత్యేక స్థానం లభిస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉత్తర కొరియాలో అధికార మార్పిడి ఎప్పటికీ వంశపారంపర్యంగానే జరుగుతూ వచ్చింది. దేశ స్థాపకుడు కిమ్ ఇల్-సంగ్, ఆయన కుమారుడు కిమ్ జోంగ్-ఇల్, ఆ తర్వాత 2011లో అధికారంలోకి వచ్చిన కిమ్ జోంగ్ ఉన్.. తన తర్వాత వారసత్వ బాధ్యతలు కిమ్-జు-యేకు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications