వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతదేశంలో కోవిడ్ కారణంగా పెరుగుతున్న అనాథ పిల్లలు...ఈ సమస్యకు పరిష్కారం ఏంటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవీడ్ సెకండ్ వేవ్‌లో పిల్లలు ఎక్కువగా దురదృష్టకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు

ఐదేళ్ల ప్రథమ్, 10 నెలల ఆయుష్ కోవిడ్ కారణంగా ఏప్రిల్‌లో తమ తండ్రిని కోల్పోయారు. కొన్ని రోజుల తరువాత, దిల్లీలోని మరో ఆస్పత్రిలో తల్లినీ కోల్పోయారు.

దాంతో వాళ్ల ప్రపంచమే మారిపోయింది. కానీ, ఆ పసివాళ్లకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావట్లేదు. అమ్మ, నాన్న ఇంకా ఎందుకు ఇంటికి రావట్లేదు ? వారి కోసం ఇద్దరూ ఎదురు చూస్తున్నారు.

అమ్మా, నాన్న పని మీద దూరం వెళ్లారని బంధువులు ప్రథమ్‌కు చెప్పారు. కానీ, వాళ్లు ఎప్పుడొస్తారని ఆ చిన్నారి రోజూ అడుగుతూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆ పసివాళ్లకు సర్ది చెప్పడం కష్టమైపోతోంది.

ఈ పిల్లల బాధ్యత అప్పజెప్పేందుకు బంధువులు దిల్లీలోని ఒక ఎన్జీఓను సంప్రదించారు. మనసున్న వారెవరైనా ముందుకు వచ్చి ప్రథమ్‌ను, అతని తమ్ముడిని దత్తత తీసుకుంటారని ఆ ఎన్జీఓ ఆశిస్తోంది.

పన్నెండేళ్ల సోనియా, ఏడేళ్ల అమిత్ కిందటి ఏడాది జూన్‌లో కరోనా మొదటి దశలో తమ తండ్రిని కోల్పోయారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో తల్లిని కూడా కోల్పోయారు.

ప్రస్తుతం ఈ చిన్నారులు వాళ్ల నానమ్మ దగ్గర ఉన్నారు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆవిడ చాలా ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో, వారిని దత్తత ఇవ్వడానికి కూడా ఆమె మనసు అంగీకరించట్లేదు.

"నా తరువాత వీళ్లను ఎవరు సాకుతారో తెలియట్లేదు. వీళ్లు నా వారసులు. నా మనుమలు. దత్తత తీసుకుంటామని చాలామంది ముందుకు వస్తున్నారు. కానీ వీళ్లని నేనెలా వదులుకోగలను?" అని ఆమె అంటున్నారు.

కరోనా రెండో దశలో దేశవ్యాప్తంగా లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు

ఎందరో అనాథలు

ఈ పిల్లలే కాదు, కోవిడ్ కారణంగా భారతదేశంలో అనేకమంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. కుటుంబాలు విచ్చిన్నమై పోయాయి.

కరోనా కారణంగా ఏప్రిల్ 1, మే 25 మధ్యలో కనీసం 577 మంది పిల్లలు అనాథలుగా మారారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇటీవలే ట్వీట్ చేశారు.

ఈ సంఖ్యను తక్కువ అంచనా వేశారని, వాస్తవంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఇంకా ఎక్కువమందే ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం చేసే క్రమంలో ఒక్కొక్కరికీ 10 లక్షల ఫండ్ కేటాయించనున్నట్లు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఈ పథకంలో భాగంగా ఆ పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తరువాత ప్రతీ నెలా స్టైపెండ్ కింద కొంత సొమ్ము అందిస్తారు. 23 ఏళ్లు వచ్చిన తరువాత 10 లక్షల ఫండ్ అందిస్తారు.

అనాథ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చైల్డ్ ట్రాఫికింగ్ ప్రమాదం ఉందని సామాజిక వేత్తలు అంటున్నారు.

భారతదేశంలో దత్తత రేటు తక్కువ

భారతదేశంలో దత్తతకు సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ పిల్లల రక్షణ, సంక్షేమం చూసే వ్యవస్థ (చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ వెల్‌ఫేర్ కమిషన్) ఉంటుంది. ఇది జిల్లాల్లో అధికారులను నియమిస్తుంది.

ఇదే కాకుండా, అనేక ఎన్జీఓలు ఈ దిశలో పని చేస్తున్నాయి. ఆపదలో ఉన్న పిల్లలను కనుగొనడంలో కమీషన్‌కు సహాయ పడతాయి.

అలాగే, పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారి కోసం జాతీయ స్థాయిలో ఒక వెబ్‌సైట్ ఉంది. దత్తత కోసం తల్లిదండ్రులు ఈ వెబ్‌సైట్‌లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

అవసరమైన తనిఖీలు అన్ని నిర్వహించాక, రాష్ట్ర శిశు సంక్షేమ కమిటీ చట్టబద్ధంగా దత్తతకు అర్హులైన పిల్లలను రిజిస్టర్ చేసుకున్నవారికి అప్పగిస్తుంది.

అయితే, భారతదేశంలో పిల్లలను దత్తత తీసుకునేవారి సంఖ్య చాలా తక్కువ.

2019 సంవత్సరం లెక్కలు చూస్తే, 2020 మార్చి వరకూ కేవలం 3,351 మంది పిల్లలను మాత్రమే దత్తత తీసుకున్నారు. కానీ, అనాథలైన పిల్లలు లక్షల్లో ఉన్నారు. అదే అమెరికాలో 2019లో 66,000 మంది పిల్లలను దత్తతకు తీసుకున్నారు.

ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంఖ్య అమాంతంగా పెరిగిపోయిందని పిల్లల హక్కుల సంరక్షణ కమీషన్ దిల్లీ శాఖ చైర్‌పర్సన్ అనురాగ్ కుందు తెలిపారు.

"ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం నా జీవితంలో చూడలేదు. వీరందరి పిల్లలు అనాథలుగా మారి ఉంటారు. వీళ్లల్లో 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారే ఎక్కువగా ఉండి ఉంటారు. ఓ రకంగా ఇది జాతీయ విపత్తు" అని కుందు అన్నారు.

అధిక జనాభా గల ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్ కారణంగా 1,000 కన్నా ఎక్కువ మంది పిల్లలు అనాథలుగా మారినట్లు గుర్తించామని ఆ రాష్ట్ర శిశు సంక్షేమ కమిషన్ సభ్యులు డాక్టర్ ప్రీతి వర్మ తెలిపారు.

జాతీయ స్థాయిలో చూస్తే ఈ సంఖ్య ఇంకా చాలా పెద్దదే ఉండవచ్చని ఆమె అన్నారు.

ఇలాంటి పిల్లలను గుర్తించే పనిని ఉత్తర్ ప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుళ్లకు, గ్రామ స్థాయి ఆరోగ్య కార్యకర్తలకు, గ్రామ ప్రముఖులకు అప్పగించామని డాక్టర్ ప్రీతి వర్మ తెలిపారు.

అనేక రాష్ట్రాల్లో శ్మశానవాటికలు మృతదేహాలతో నిండిపోయాయి

స్వల్పకాలిక సంరక్షణ

ప్రస్తుతం ఈ సమస్య తీవ్రతను తగ్గించేందుకు దత్తత కన్నా పిల్లలకు తాత్కాలికంగా సంరక్షణ కల్పించే ఏర్పాటు చేయాలని అనురాగ్ కుందు అభిప్రాయపడ్డారు.

"అనాథ అయిన ప్రతీ బిడ్డను దత్తత తీసుకుంటారనుకోవడం వాస్తవ దూరం. కొద్ది కాలం పాటూ పిల్లల సంరక్షణ బాధ్యతలు తీసుకునేందుకు తల్లిదండ్రులు ముందుకు రావొచ్చు. స్వల్పకాలిక సంరక్షణ అనేది మంచి ఆలోచన. కానీ, మన దేశంలో దీని గురించి ఎక్కువమందికి తెలీదు. చట్టంలో దీని గురించి నిర్దిష్టమైన నిబంధన ఉంది" అని కుందు అన్నారు.

స్వల్పకాలిక సంరక్షణలో భాగంగా అనాథలైన పిల్లలను బంధువులు లేదా స్నేహితులు కొన్నాళ్లపాటూ పెంచుకోవచ్చు. వెంటనే వాళ్లని అనాథ శరణాలయాలను పంపకుండా కొంత కాలం తమ వద్దే ఉంచుకోవచ్చు.

ఇలాంటి వ్యవస్థ వృద్ధి చెందితే భారతదేశంలో దత్తత రేటు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కొంత కాలంపాటు పెంచుకోవడానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులకు వారితో అనుబంధం పెరిగి పూర్తిగా దత్తత తీసుకోవచ్చు. తాత్కాలిక సంరక్షణ ఒక ప్రేరణలాగ ఉపయోగ పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

దేశంలో అనాథలుగా మారుతున్న పిల్లల సంఖ్య అంచనాల కన్నా ఎక్కువే ఉంటుందని నిపుణులు అంటున్నారు.

చైల్డ్ ట్రాఫికింగ్ భయాలు

కరోనా కాలంలో మందులు, ఆక్సిజన్, పడకల కోసం అనేకమంది సోషల్ మీడియాపై ఆధారపడ్డారు. అదే విధంగా, కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలను దత్తత తీసుకోండి అంటూ అభ్యర్థనలు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

అయితే, ఇలా పిల్లల వివరాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లు పబ్లిక్‌గా అందుబాటులో ఉంచడం వలన చైల్డ్ ట్రాఫికింగ్ పెరిగే ప్రమాదం కూడా ఉంది.

"అమెజాన్ వంటి మార్కెట్‌లాగా పిల్లలను ఎంపిక చేసుకునే ఆన్‌లైన్ సర్వీస్‌గా సోషల్ మీడియా మారే ప్రమాదం ఉందని కుందు హెచ్చరిస్తున్నారు. పిల్లలను దత్తతకు ఇచ్చే ఒక ఫేస్‌బుక్ పేజీ తమ బృందం కళ్లబడిందని ఆయన చెప్పారు.

"మా సిబ్బందిలో ఒకరు ఆ ఫేస్‌బుక్ పేజీలో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. ఒక్కొక్క పిల్ల/పిల్లవాడి ధర సుమారు 5 లక్షలు చెప్పారు. మేము వెంటనే ఆ గ్రూప్ గురించి పోలీసులకు సమాచారం అందించాం" అని కుందు తెలిపారు.

భారతదేశంలో పిల్లలను సెక్స్ వర్కర్లుగా మార్చే ప్రమాదం ఉందని లేదా వారిని శ్రామికులుగా మార్చి దోపిడి చేస్తారనే భయాలు ఉన్నాయి.

ఇలాంటి కేసులు ఎన్నో చూశామని దిల్లీకి చెందిన ఎన్జీఓ 'ప్రోత్సాహన్' సీఈఓ సోనల్ కపూర్ తెలిపారు. తల్లి చనిపోతే పిల్లలను తక్కువ జీతానికి పనుల్లో పెట్టి శ్రామికులుగా మార్చిన తండ్రులను చూశాం అని ఆమె చెప్పారు.

కోవిడ్ పరిస్థితుల్లో ఇలా తల్లిగానీ, తండ్రిగానీ చనిపోయిన పిల్లలు చాలామందే ఉన్నారు. వీరి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఒక కేసులో తల్లి కోవిడ్‌తో మంచం పట్టిన తరువాత కూతుళ్లపై లైంగికంగా దాడి చేసిన తండ్రిని చూశామని సోనల్ తెలిపారు.

"కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలు, వారి సంరక్షణ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. కానీ, అది సగం సమస్య మాత్రమే. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లల సంఖ్యా తక్కువేం కాదు, వారి గురించి కూడా మనం ఆలోచించాలి" అని ఆమె అన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో తమ సంస్థ ’ప్రోత్సాహన్‌'కు హృదయ విదారకమైన విజ్ఞాపనలతో అనేక కాల్స్ వచ్చాయని ఆమె చెప్పారు.

"ఒకసారి ఇద్దరు చిన్నపిల్లల నుంచి కాల్ వచ్చింది. వాళ్ల నాన్న కోవిడ్‌తో మరణించారు. ఆయన్ను దహనం చేయడానికి సహాయం కావాలని వాళ్లు అడిగారు. వాళ్ల అమ్మ కోవిడ్‌తో పోరాడుతున్నారు." అని సోనల్ వివరించారు.

మరో కుటుంబంలో తల్లి చనిపోయింది. తండ్రి షాక్‌లో ఉండి మూడు రోజుల పాటూ పిల్లలను పట్టించుకోలేదు. వారి బంధువులు ఫోన్ చేసి పిల్లలకు తిండి పెట్టమని అడిగారని ఆమె వెల్లడించారు.

కోవిడ్ కారణంగా అనాథలైపోయిన పిల్లల సంరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాయత్తమవుతున్నాయి. అయితే, ఈ ప్రయత్నాలు చాలవని, భారీ స్థాయిలో పథకాలు ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

సత్వర చర్యలు చేపట్టకపోతే ఎంతోమంది పిల్లలు ఒక కుటుంబం లేకుండా ఒంటరిగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Orphan children increasing due to covid-19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X