షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం: 14 మంది సజీవ దహనం!
పాకిస్థాన్‌లోని కరాచీ నగరం జిన్నా రోడ్డులో ఉన్న ప్రసిద్ధ గుల్ ప్లాజా షాపింగ్ మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రారంభమైన మంటలు కొద్దిసేపటికే మాల్ అంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. శనివారం అర్ధరాత్రి మంటలు చెలరేగగా.. 24 గంటలు గడిచినా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత ఆరుగురు మరణించినట్లు వార్తలు రాగా.. ఆదివారం నాటికి ఆ సంఖ్య 14కు పెరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
60 మందికి పైగా గల్లంతు:
అగ్నిప్రమాదం జరిగి ఒక రోజు గడిచినా ఇంకా 60 మందికి పైగా వ్యక్తుల ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్‌లు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మాల్‌లోని కిటికీలను కట్టర్లతో కట్ చేస్తూ.. గోడలను సుత్తులతో బద్దలు కొడుతూ లోపలికి ప్రవేశించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. లోపల భారీగా పేరుకుపోయిన శిథిలాల వల్ల సెర్చ్ ఆపరేషన్ ఆలస్యమవుతోంది.

ఆస్పత్రిలో క్షతగాత్రులు:
ఈ ప్రమాదంలో గాయపడిన పదుల సంఖ్యలో బాధితులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పొగ పీల్చడం వల్ల చాలా మంది ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు.ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన తర్వాత లోతైన విచారణ చేపడతామని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications