• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రతిపక్షానికీ మధ్య జరుగుతున్న యుద్ధంలో సైన్యం ఎటు వైపు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి రోజులు గడుస్తున్నాయి. ఈ కీలక రాజకీయ పరిణామంలో సైన్యం ఎవరి వైపు ఉంది అన్న అనుమానం అందరి మదిలో మెదులుతోంది. అయితే ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే దేశ చరిత్రలోనే తొలిసారిగా సైన్యం తటస్థ వైఖరిని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికి కూడా ఒక కారణం ఉంది. మూడు వారాలుగా దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుంటే, సైన్యం వైపు నుంచి ఎలాంటి ప్రకటనలు లేవు. మార్చి 10న, పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ ఒక ప్రకటన చేశారు. పాకిస్తాన్ సైన్యం తటస్థంగా ఉంటుందని, దాన్ని రాజకీయాల్లోకి లాగవద్దనీ అన్నారు. .

అయితే, పాకిస్తాన్ సైన్యం తటస్థంగా ఉండటం సాధ్యమా అన్న ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంతో ప్రతిపక్ష పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) ఒప్పందానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది పాకిస్తాన్ రాజకీయాలలో కొత్త ఊహాగానాలకు దారితీసింది.

ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ తనతోపాటు నలుగురు వ్యక్తుల గురించి చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రధానికి రాజకీయ వ్యవహారాల ప్రత్యేక సహాయకుడు షాబాజ్ గిల్ పేర్కొన్నారు. ఆ నలుగురిలో షాబాజ్ షరీఫ్ తోపాటు ఆయన కుమారుడు హంజా షాబాజ్, నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ ఉన్నారు.

అయితే, అలాంటి ఒప్పందమేదీ కుదరలేదని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి బాబర్ ఇఫ్తికార్ అన్నారు. ''ఎవరు ఎవరితో ఒప్పందాలకు ప్రయత్నిస్తున్నారో చెప్పే వ్యక్తి నుంచే ఇలాంటి వాటి మీద వివరణ అడగాలి’’ అని ఆయన అన్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధాన పక్షం పాకిస్తాన్ ముస్లిం (నవాజ్ ) కూడా ఈ ఊహాగానాలను ఖండించింది. అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా పాలిటిక్స్ మారిపోవడం ప్రారంభించాయి.

ఏకమైన ప్రతిపక్షాలు

గత కొన్నాళ్లుగా అవిశ్వాస తీర్మానం కోసం ఏకం కాలేకపోయిన విపక్షాలు ఇప్పుడు స్వరం కలిపాయి. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్, సోదరుడు షాబాజ్ షరీఫ్ ముందుండి కథ నడిపిస్తున్నారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఒకే వేదికపైకి వచ్చాయి. మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ నాయకత్వంలోని జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం ఎప్పటి నుండో ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగాలని కోరుకుంటోంది.

ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ముగ్గురు ప్రధాన మిత్రులైన పీఎంఎల్-క్యూ, ముత్తాహిదా ఖ్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం), బలూచిస్తాన్ ఆవామీ పార్టీ (బీఏపీ)ల అసంతృప్తి ఇమ్రాన్ ఖాన్ కు ప్రమాదకరం. తాజాగా ఎంక్యూఎం ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకుంది. మిగిలిన మిత్రపక్షాలు ఇమ్రాన్ ఖాన్‌కు పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వాలో లేదో ఈ కథనం ప్రచురించే సమయానికి నిర్ణయించలేదు.

ఇంకొంచెం వెనక్కి వెళితే, ఐఎస్‌ఐ చీఫ్ నియామకంపై ఆర్మీతో మొదటిసారి ప్రత్యక్షంగా విభేదాలు గత ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బయటపడ్డాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అప్పటి చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను మరికొంత కాలం కొనసాగించాలని భావించారు. కానీ సైన్యం ఉద్దేశాలు భిన్నంగా ఉన్నాయి.

ఈ వివాదంపై ఇరుపక్షాలు తమ వైఖరికి కట్టుబడి ఉన్నాయి. రాబోయే కొద్ది నెలల్లో కొత్త ఆర్మీ స్టాఫ్‌ను నియమించే విషయంలో ప్రధాని మరింత సున్నితమైన, ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఆర్మీ చీఫ్ కమర్ జావెద్ బజ్వా

త్వరలో కొత్త ఆర్మీ చీఫ్‌ నియామకం

ఫైసలాబాద్ ధర్నాలో డబ్బులు పంచడం, కాబూల్‌లో కాఫీ తాగుతున్న ఫొటోలు పెట్టుకోవడం కంటే సైన్యంలో జనరల్ ఫైజ్‌కి చెప్పుకోదగ్గ అర్హతలు ఏవీ లేవన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఆర్మీ చీఫ్ అపాయింట్‌మెంట్ రేసులో ఆయన ఉంటే, ఇమ్రాన్ ఖాన్ వైపు మొగ్గు చూపడం ఆయనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

లాహోర్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా విద్యార్ధులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఉన్న సంబంధాలపై కొంత క్లారిటీ ఇచ్చాయి. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ''నేను సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాను అన్నదే నిజమైతే, అలా భావించే వారికి ఇమ్రాన్ ఖాన్ అంటే ఎవరో తెలిసి ఉండేది కాదు'' అని అన్నట్లు తెలిసింది.

ఐఎస్‌ఐ చీఫ్‌ నియామకం సందర్భంగా ఈ పదవికి నియామకం చేపట్టే హక్కు తనకు ఉందని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ఇది సైన్యానికి, ఇమ్రాన్ ఖాన్ కు మధ్య భిన్నాభిప్రాయాలను బైటపెట్టింది. దీంతోపాటు యుక్రెయిన్ యుద్ధం వంటి ముఖ్యమైన విషయాల్లో తటస్థంగా ఉండాలనే నిర్ణయంపై సైన్యం అభిప్రాయం ఏమిటో స్పష్టంగా తెలియలేదు.

ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు, కానీ మద్దతు కూడా కనిపించలేదు. అయితే, ఇవన్నీ కేవలం సూచికలు మాత్రమే. కచ్చితమైన సాక్ష్యాలు కాదు.

సైన్యం తటస్థంగా ఉండటం ప్రభుత్వానికి ఏ విధంగానూ సరిపోదు. అందుకే జంతువులు మాత్రమే తటస్థంగా ఉంటాయని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం సైన్యం ప్రభుత్వంతో ఉందని ప్రభుత్వ ప్రతినిధి ఫవాద్ చౌదరి చెప్పారు. తన ప్రకటనను వక్రీకరించారని ఇమ్రాన్ ఖాన్ తర్వాత అన్నారు.

సైన్యంతో ఇమ్రాన్‌ ఖాన్‌కు సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ, చాలా చోట్ల ఆయన ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అవినీతిపరులు అని ఆరోపణలు ఎదుర్కొన్న వారెవరికీ శిక్ష పడలేదు.

తాజాగా పాకిస్తాన్‌లోని ముత్తహిదా ఖ్వామీ మూవ్‌మెంట్-పాకిస్తాన్ (ఎంక్యూఎం-పీ) పార్టీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకుంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా ఎంక్యూఎం-పీ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

దూరమవుతున్న ఇమ్రాన్ మిత్రులు

ఎంక్యూఎం-పీ కన్వీనర్ ఖాలిద్ మఖ్బూల్ సిద్దిఖీ బుధవారం పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన వెంట ప్రతిపక్ష నాయకులు షాబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో కూడా ఉన్నారు.

వ్యక్తిగత ప్రయోజనాల కంటే పాకిస్తాన్ ప్రయోజనాలకే తాము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతూ ఖాలిద్ వివరాలు వెల్లడించారు. ఇది చరిత్రాత్మక రోజని పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకుడు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)కు చెందిన షాబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ తదుపరి ప్రధాన మంత్రిగా షాబాజ్ షరీఫ్‌ను ఎన్నుకోబోతున్నట్లు పాకిస్తాన్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. ''ఇమ్రాన్ ఖాన్ మెజారిటీని కోల్పోయారు. ఇప్పుడు ఎంక్యూఎం-పీ కూడా మాతో కలిసింది'' అని ఆయన చెప్పారు. తమ ప్రతిపక్ష కూటమిలోనున్న పార్టీల జాబితాను ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బిలావల్ భుట్టో పక్కనే షాబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు.

''రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ను పట్టుబట్టే అధికారం షాబాజ్ షరీఫ్‌కు ఉంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు వేరే ప్రత్యామ్నాయం లేదు'' అని భుట్టో అన్నారు.

పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మార్చి 31 చర్చ జరగనుంది. ఏప్రిల్ 3న ఓటింగ్ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pakistan: Which side is the army on in the ongoing war between Imran Khan and the opposition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X