జార్జియా మెలోనీ ఆహ్వానం: ఇటలీ పర్యటనకు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్!
ఇటలీ ఉపప్రధాని ఆంటోనియో తజానీ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన ఉపప్రధానిగా ఉండటంతో పాటు విదేశీ, అంతర్జాతీయ సహకార మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఆంటోనీ తజానీ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వీరిద్దరూ ప్రధానంగా ఇండియా-ఇటలీ మధ్య జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029 అమలు దిశగా ఇరు దేశాలు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. ఈ చర్యలలో ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, పరిశోధన, ఆవిష్కరణలు, రక్షణ, అంతరిక్షం, కనెక్టివిటీ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, విద్య, ప్రజా సంబంధాలు వంటి రంగాలపై దృష్టి సారించారు. భారత్-ఇటలీ మైత్రి నిరంతరం బలోపేతం అవుతోందని, దీని ద్వారా రెండు దేశాల ప్రజలకు, ప్రపంచానికి విస్తృత ప్రయోజనాలు చేకూరుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ అంగీకారం
ప్రధాని మోదీతో భేటీ అనంతరం తజానీ మాట్లాడుతూ, ఈ సమావేశం చాలా సానుకూలంగా జరిగిందని తెలిపారు. భారతదేశం-ఇటలీ మధ్య అద్భుతమైన సంబంధాలు, భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (IMEC), ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించడానికి రష్యాపై ఒత్తిడి తీసుకురావడం, అనేక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, పారిశ్రామిక సహకారం, శాంతి వంటి ముఖ్యమైన అంశాలపై తాము చర్చించామని వెల్లడించారు.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తరపున ప్రధానమంత్రి మోదీని ఇటలీకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు ఆంటోనియో తజానీ తెలిపారు. దీనికి ప్రతిగా ప్రధాని మోదీ కూడా అంగీకారం తెలిపారు. ప్రధాని మోదీ, మెలోనీ మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.
మోదీ ఇటలీ పర్యటన ఎప్పుడు?
ప్రధాని మోదీ 2026లో ఇటలీలో పర్యటించే అవకాశం ఉందని తజానీ తెలిపారు. మెలోనీ కూడా భారతదేశంలో పర్యటిస్తారా అని తజానీని ప్రశ్నించగా.. ఇటలీ ప్రధాని కూడా భారత్‌లో పర్యటిస్తారని, అయితే ఈ పర్యటన ఎప్పుడు జరుగుతుందో ప్రస్తుతం నిర్ణయించబడలేదని చెప్పారు. మెలోనీ కూడా 2026లోనే భారత్‌ను సందర్శించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications