Super El Nino: శతాబ్దంలోనే అత్యంత భారీ ముప్పు.. ! ప్రపంచానికి వణికిపోయే వార్త !
ఈ ఏడాది ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న ఎల్ నినో పరిస్ధితులు పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమైనట్లు అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ఇవి త్వరలో అత్యంత తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈసారి వస్తున్న ఎల్ నినో శతాబ్దంలోనే అత్యంత బలమైనదిగా ఉంటుందని, దీనిని "సూపర్ ఎల్ నినో" (Super El Nino) అని పిలుస్తున్నామని వారు తెలిపారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ దీనిని "అత్యవసర వాతావరణ హెచ్చరిక"గా అభివర్ణించారు.
అత్యంత వేడి సంవత్సరంగా 2027
ఎల్ నినో అనేది భూమధ్యరేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల జరిగే పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని, ఉష్ణోగ్రతలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 2026-27 శీతాకాలంలో దీని ప్రభావం ఉత్తరార్ధగోళంపై ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణ మార్పుల వల్ల 2027 ప్రపంచంలోనే అత్యంత వేడి సంవత్సరంగా నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో వాతావరణంలో అనిశ్చితి పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది.

ప్రాంతాన్ని బట్టి ప్రభావం
ప్రతి ఎల్ నినో ఒకేలా ఉండదు, ప్రతి ఒక్కటి దాని స్వంత ముద్రను వాతావరణంపై వదులుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అలాగే అడ్వాన్స్‌డ్ మానిటరింగ్ వ్యవస్థల ద్వారా వాతావరణ మార్పులను అంచనా వేయడం సాధ్యమని వారు చెప్తున్నారు. అధునాతన పర్యవేక్షణ, ఎల్ నినో నమూనాలపై మెరుగైన అవగాహన, ప్రజలను, భాగస్వాములను రాబోయే పరిణామాలకు సిద్ధం చేసేందుకు సహాయపడుతుందని వారు పేర్కొంటున్నారు. ఎల్ నినో ప్రభావం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇది అట్లాంటిక్ ప్రాంతంలో హరికేన్ల తీవ్రతను తగ్గిస్తుండగా, పసిఫిక్ ప్రాంతంలో ముప్పును పెంచవచ్చు. హవై వంటి దీవులకు అప్రమత్తత అవసరం. అమెరికాలో శీతాకాలంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆఫ్రికాలో కరువు, వరదల మిశ్రమ ప్రభావం ఉండొచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

భారత్ పై ప్రభావం- ఆహార భద్రత
ఈ ఎల్ నినో కారణంగా తలెత్తే వాతావరణ మార్పులు ప్రపంచ ఆహార సరఫరాను దెబ్బతీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి వంటి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది భారత్, ఇండోనేషియా, బ్రెజిల్ పై ఎక్కువగా ప్రభావం చూపుతుందని అంచనా. భారత్‌లో ఎల్ నినో కారణంగా వేడి గాలులు తీవ్రమయ్యే అవకాశం ఉంది. గతంలో 2015-16 నాటి సూపర్ ఎల్ నినో సమయంలో దేశంలో సగటు వర్షపాతంలో కేవలం 86 శాతం మాత్రమే నమోదైంది. కేవలం ఎల్ నినో మాత్రమే కాకుండా, ఇతర వాతావరణ కారకాలు కూడా దేశీయ రుతుపవనాలను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications