ఐఎస్‌లో చేరేందుకు బ్యాంకు లోన్, సొంత వాళ్లనే చంపేసిన టెర్రరిస్ట్‌లు!
కౌలాలంపూర్: మలేషియాలో ఉగ్రవాదుల్లో చేరిపోవడానికి అప్పులు చేస్తున్నారట. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో కలిసిపోయేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు మలేషియన్లను పట్టుకొని మలేషియా పోలీసులు విచారించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులుకు పట్టుబడిన వారు రూ.20 లక్షలకు తగ్గకుండా బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
సొంతవాళ్లనే చంపేశారు
ఐఎస్ ఉగ్రవాదులు తమ క్రూరత్వాన్ని అందరి పైన ప్రదర్శిస్తున్నారు. షరియా చట్టం అమలును వ్యతిరేకించినందుకు ఇరాక్‌లో గర్భిణులతో సహా 240 మందికి పైగా స్థానికులను నిర్దాక్షిణ్యంగా చంపిన ఘటన ఇటీవల వెలుగులోకి రాగా.. తాజాగా సొంత సంస్థలో పని చేస్తున్న 100 మంది విదేశీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఐఎస్ పట్ల ఆకర్షితులైన పలు దేశాల యువకులు ఈ సంస్థలో పని చేయడానికి సిరియాకు వెళ్లారు. కానీ, ఆ సంస్థ పట్ల ఉన్న భ్రమలు వారిలో త్వరలో తొలగిపోయాయి. ఈ క్రమంలో రఖాలోని ఐఎస్ ప్రధాన కార్యాలయం నుంచి పారిపోవడానికి వారు ప్రయత్నించారు.

దీంతో, అలాంటి వారి పట్ల ఐఎస్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని, వంద మంది విదేశీ కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా చంపేసిందని ఐఎస్, అసద్ ప్రభుత్వాలను వ్యతిరేకిస్తున్న ఒక కార్యకర్త చెప్పాడు. వాస్తవానికి సిరియాలోని అసద్ ప్రభుత్వానికి మాత్రమే వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వారు అక్కడికి వెళ్లారు.
ఇతర తిరుగుబాటు గ్రూపులకు వ్యతిరేకంగా తాము పోరాటం చేయబోమని ఐఎస్‌కు స్పష్టం చేస్తున్నారు. దీంతో, చెప్పినట్లు నడుచుకోని వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక మిలటరీ పోలీస్ విభాగాన్ని కూడా ఐఎస్ ఏర్పాటు చేసింది. ఈ విభాగం భారీ సంఖ్యలో ఇళ్లపై దాడులు చేసి, పలువురు జిహాదిస్టులను అరెస్టు చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక పేర్కొంది.












Click it and Unblock the Notifications