భారత్‌ను ఫాలో అవుతున్న అమెరికా- జో బైడెన్‌కు సర్వాధికారాలు..!!
చైనాకు చెందిన షార్ట్ వీడియో హోస్టింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కార్యకలాపాలను ఇక అమెరికా కూడా నిషేధించనుంది. దీనికి అవసరమైన అధికారాలను అధ్యక్షుడు జో బైడెన్ కు అప్పగించడానికి ఉద్దేశించిన తీర్మానంపై యూఎస్ హౌస్ కమిటీ ఆమోదం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా భారత్ లైన్ ను ఎంచుకుంది. భారత్ బాటలో సాగనుంది. చైనాపై వాణిజ్య యుద్ధాన్ని మరింత ముమ్మరం చేసింది అమెరికా. తమ దేశంపై స్పై బెలూన్ల ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడినట్లు బలంగా నమ్ముతోన్న అగ్రరాజ్యం.. దీనికి ప్రతీకార చర్యకు దిగింది. చైనాకు చెందిన పాపులర్ షార్ట్ వీడియో హోస్టింగ్ ప్లాట్ ఫామ్ టిక్ టాక్ ను నిషేధించబోతోంది. దీనికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంది. దీనికి సంబంధించిన ఆర్డర్లపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయడం మాత్రమే మిగిలివుందిక.

స్పై బెలూన్ తరువాత.
కొద్దిరోజుల కిందట స్పై బెలూన్.. అమెరికాను గడగడలాడించిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య వాగ్వివాదానికి దారి తీసిందీ ఘటన. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. చైనా ప్రయోగించినట్లు భావించిన ఈ బెలూన్ అమెరికాలోని మోంటానాతో పాటు రక్షణపరంగా అత్యంత సున్నిత ప్రాంతాల గగనతలంపై కనిపించింది. దీన్ని స్పై బెలూన్ గా నిర్ధారించింది అమెరికా. మూడు బస్సుల పరిమాణంలో కనిపించిన ఈ బెలూన్ ను ధ్వంసం చేసింది.

ప్రతీకారం..
దీని తరువాత- అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాను నిర్వహించ తలపెట్టిన చైనా పర్యటనను రద్దు చేసుకోవడం- రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పతాకస్థాయికి తీసుకెళ్లింది. తైవాన్ అండగా ఉంటామని ప్రకటించిన అనంతరం ఈ బెలూన్.. అమెరికా గగనతలంపై ఈ బెలూన్ కనిపించడం కలకలం రేపింది. దీన్ని తీవ్రంగా పరిగణించింది అమెరికా.

టిక్ టాక్ నిషేధానికి..
దీనికి అమెరికా ప్రతీకార చర్యకు దిగింది. టిక్ టాక్ ను నిషేధించడానికి రంగం సిద్ధం చేసింది. ఇదివరకే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను యూఎస్ హౌస్ కమిటీకి పంపించింది ప్రభుత్వం. తాజాగా ఈ ప్రతిపాదనలపై హౌస్ కమిటీ ప్యానెల్ సభ్యులు ఆమోదం తెలిపారు. తమ దేశంలో టిక్ టాక్ కార్యకలాపాలన్నింటినీ నిషేధించడానికి అవసరమైన సర్వాధికారాలను అధ్యక్షుడు జో బైడెన్ కు అప్పగిస్తూ తీర్మానం చేసింది.

మెజారిటీ మెంబర్స్
దీనికి సంబంధించిన తీర్మానంపై యూఎస్ హౌస్ కమిటీ మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. ఈ కమిటీకి రిపబ్లికన్ మెంబర్ మైఖాయిల్ మెక్‌కౌల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్నారు. ఈ బిల్లును అధికార డెమొక్రాట్లు వ్యతిరేకించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టిక్ టాక్ ద్వారా చైనా ఏ విధంగా తమ దేశ రక్షణ సమాచారాన్ని తస్కరిస్తోందనేది ఈ బిల్లులో స్పష్టంగా పొందుపర్చలేదనేది వారి వాదన.

ప్రైవసీపై నిఘా..
టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటోన్నామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ క్యారిన్ జీన్-పియర్రె తెలిపారు. టిక్ టాక్ యాప్ ను జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకారిగా భావిస్తున్నామని తేల్చి చెప్పారు. దీన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని, అందుకే హౌస్ కాంగ్రెస్ అభిప్రాయాన్ని కోరామని వివరించారు. అమెరికన్ల ప్రైవసీని కూడా చైనా తస్కరిస్తోందని, ఈ యాప్ ద్వారా నిఘా ఉంచిందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications