అమెరికాలో భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. చెల్లించాల్సిందేనన్న ట్రంప్..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్.. అమెరికా పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజల్ని పిడుగులాంటి వార్త ఇప్పుడు భయపెడుతోంది.
హార్మూజ్ జలసంధింలో ఇరాన్ తో ప్రతిష్టంభన కారణంగా అమెరికాలో గ్యాస్ ధరలు భారీగా పెరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే పెరిగిన ధరలను అమెరికన్ ప్రజలు అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాలో గ్యాస్ ధరలు గాలన్ కు 4.08 డాలర్ల చొప్పున పెరిగాయి. హార్మూజ్ జలసంధిలో ప్రతిష్టంభన కొనసాగుతున్న కారణంగానే ఈ ధరలు పెరిగినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో నేను క్షమించమని కోరడం లేదని.. నేను సరైన నిర్ణయం తీసుకున్నాననే అనుకుంటున్నా.. మనం ఇది భరించాలి.. అని ట్రంప్ స్పష్టం చేశారు. న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో నిర్వహించిన పొలిటికల్ ర్యాలీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ తో యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు పెరుగుతాయని.. ఆ ధరలను భరించేందుకు అమెరికన్ ప్రజలు సిద్ధంగా ఉండాలని ట్రంప్ పేర్కొన్నారు. అధిక ధరల కారణంగా ఇరాన్ కు అణ్వాయుధాలు లభించకుండా నిరోధించే అవకాశం ఉందన్నారు. వ్యూహాత్మకమైన హార్మూజ్ జలసంధిని అమెరికా కంట్రోల్ లోకి తెచ్చుకోవడం ఎంతో అవసరం అని.. అదే ఇరాన్ పై అతిపెద్ద విజయం అని ట్రంప్ స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి నుంచి చమురు, గ్యాస్ రవాణా ప్రస్తుతం కష్టతరం కావడంతో అమెరికా గ్యాస్ ధరలను పెంచింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ అంచనాల ప్రకారం.. యావరేజ్ గా అమెరికా గాసోలిన్ ధరలు 4.08 గ్యాలన్ కు చేరుకున్నాయి. గతేడాదితో పోల్చితే ఇది 29 శాతం పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వారాంతపు పెరుగుదల 6 శాతంగా ఉంది. అయితే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ ధరలు 5.4 శాతంగా ఉన్నాయి. ఇక అమెరికా.. ఇరాన్ తో చర్చలకు సిద్ధం అవుతోందన్న కథనాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా లేమని తెలిపారు.












Click it and Unblock the Notifications