ట్రంప్ సంచలన ప్రకటన.. హార్మూజ్ కార్గో ఫీజు రద్దు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై 20 శాతం ఫీజు విధించే ప్రతిపాదనపై యూటర్న్ తీసుకున్నారు. అందుకు బదులుగా గల్ఫ్ దేశాలతో వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుంటామని ప్రకటించారు.
" సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ మిగతా గల్ఫ్ దేశాలతో నేను మాట్లాడాను. ఆ దేశాలన్నీ అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. రికార్డు మొత్తంలో అమెరికాలో పెట్టుబడులు పెట్టనున్నాయి. అలాగే హార్మూజ్ జలసంధిపై 20 శాతం కార్గో ఫీజు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. అయితే హార్మూజ్ జలసంధి అన్ని దేశాల నౌకలకు తెరిచి ఉంటుంది. కానీ ఇరాన్ కు మాత్రం కాదు." అని ట్రంప్ స్పష్టం చేశారు.
గల్ఫ్ దేశాలు అమెరికాలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని దీనివల్ల తయారీ రంగం బలోపేతం కావడంతో పాటు లక్షలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఈ ప్రకటన చేసిన సమయంలోనే పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా సైన్యం ఇరాన్ లోని పలు కీలక లక్ష్యాలపై దాడులు చేపట్టింది. ఇందుకు ప్రతీకారంగా అమెరికా మిత్ర దేశాలు, హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడులు ఉద్ధృతం చేస్తోంది.

ఈ క్రమంలో ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ వేదికగా మరో కీలక పోస్టు పెట్టారు. ఈ మేరకు ఇరాన్ పై విరుచుకుపడ్డారు. ఇరాన్ భవిష్యత్తులో ఎప్పటికీ అణ్వాయుధాలు పొందలేదని స్పష్టం చేశారు. వందల మందిని చంపే రోజులు ఇరాన్ కు ఇక ముగిశాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications