"భారత్ పై ఆంక్షలు, టారిఫ్ లు విధించండి".. ఆ 27 దేశాలపై ట్రంప్ ఒత్తిడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై కన్నెర్ర చేస్తూనే ఉన్నారు. రష్యా నుంచి అధిక మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఏ దేశానికి లేనంతగా భారత్ వస్తువులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. అమెరికా తీసుకున్న నిర్ణయం కారణంగా భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతేకాక ఇటీవల పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను తానే ఆపేశానని ట్రంప్ ప్రపంచ మీడియా ముందు చెప్పుకున్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. తాము ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో భారత్ పై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అమెరికాతో భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. చైనా భారత్ మధ్య బంధం బలపడుతోంది. 2020 గాల్వాన్ ఘర్షణల తర్వాత భారత్- చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. పలు దఫాలుగా చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణాల దృష్ట్యా చైనా, భారత్, రష్యా ఒక్కటవుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలే ఈ పరిణామాలకు కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి భారత్ పై అక్కసు వెల్లగక్కారు.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ ను లక్ష్యంగా చేసుకోవాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలకు ట్రంప్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇప్పటికే భారత్ పై 50 శాతం టారిఫ్ లు విధించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా మాదిరిగానే యూరప్ దేశాలన్నీ భారత్ వస్తువులపై పన్నులు విధించాలని ట్రంప్ కోరినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈయూలో 27 దేశాలు ఉన్నాయి.

మరోవైపు రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగడానికి భారత్ కారణమని అమెరికా ఆరోపణలు చేస్తోంది. రష్యా నుంచి అధిక మొత్తంలో క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేస్తున్న భారత్.. రష్యా ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తోందని తద్వారా రష్యా.. ఉక్రెయిన్ పై దాడులు చేస్తోందని అమెరికా ఆరోపణలు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడారు. రష్యా యుద్ధం తీరును ప్రధాని మోదీకి వివరించారు. రష్యాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మోదీకి జెలెన్ స్కీ వివరించారు. ప్రధాని మోదీ సైతం ఉక్రెయిన్ కు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
'कड़े प्रतिबंध लगाएं और तेल-गैस खरीद भी रोकें', 50% टैरिफ से भी दबाव में नहीं आया भारत तो ट्रंप ने EU देशों को दिया ऑर्डर! | Us Pressure On India White House Asks Europe To Impose India Like Tariff Sanctions PM Modi And Donald Trump https://t.co/p5X2ZijP8T
— Himshikha Bansal 🇮🇳 (@HimshikhaBansal) August 31, 2025
ఇక ప్రస్తుతం ప్రధాని మోదీ చైనా పర్యటనలో ఉన్నారు. చైనాలోని తియాంజిన్ వేదికగా జరిగిన SCO సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారత్- చైనా మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. సరిహద్దు వివాదాలను పక్కనపెట్టి ఇరు దేశాల అభివృద్ధికి కృషి చేయాలని భారత్- చైనా నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలో టెర్రరిజంపై పోరాటంలో భారత్ కు ఫుల్ సపోర్ట్ గా ఉంటామని చైనా హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications