Trump vs. Netanyahu: ఆపేద్దాం..కుదరదు..! ఫోన్లో పోట్లాడుకున్న ట్రంప్, నెతన్యాహు..!
ఇజ్రాయెల్ మాట విని ఇరాన్ యుద్దంలోకి దిగి అనవసరంగా ఇరుక్కుపోయిన అమెరికాకు ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియడం లేదు. రెండు నెలలుగా తమతో డీల్ చేసుకుంటే ఇరాన్ యుద్దం ఆపేస్తామంటూ ట్రంప్ పదే పదే ఆఫర్లు ఇస్తున్నా స్పందన కరవవుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం యుద్దం ఆపద్దు, ఇరాన్ ను సర్వనాశనం చేసేద్దామంటూ ట్రంప్ ను పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ లోనూ రచ్చ (trump vs. netanyahu) తప్పలేదు.
ఇరాన్ భవిష్యత్ కార్యాచరణపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్లోనే తీవ్ర వాగ్వాదం జరిగింది. గంటపాటు జరిగిన ఈ ఉద్రిక్త సంభాషణలో, నెతన్యాహు ఇరాన్‌పై వైమానిక దాడులు జరపాల్సిందేనని కోరగా, ట్రంప్ మాత్రం దౌత్యానికి మరో అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. ఇరాన్‌తో కొత్త ఒప్పందం గురించి మాట్లాడాలని ఇద్దరు నేతలు కాల్ చేసుకోగా... ఫోన్లో పోట్లాట తర్వాత నెతన్యాహు "అత్యంత ఆగ్రహంగా" ఉన్నారని, ఒక దశలో ఆయనకు ఒళ్లు మండిపోయిందంటూ ఆక్సియోస్ వార్తాసంస్ధ తెలిపింది.

ఈ సంభాషణలో ఇరాన్‌తో యుద్ధం ముగించడానికి అమెరికా, ఇజ్రాయెల్ సంతకం చేయాల్సిన లేఖపై ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తులు పనిచేస్తున్నారని ట్రంప్ నెతన్యాహుకు చెప్పారు. దీనిపై సంతకం చేశాక, హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలకు 30 రోజుల గడువు ఉంటుందని ఆక్సియోస్ వెల్లడించింది. అయితే ఈ విషయంలో నెతన్యాహు వెనక్కి తగ్గేందుకు ససేమిరా అన్నారు. గత ఒప్పందాలు నెతన్యాహును ఆందోళన పరుస్తున్నాయని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి.

మరోవైపు నెతన్యాహుతో విభేదాలు ఉన్నప్పటికీ, ఇరాన్ ప్రణాళికపై తాము ఐక్యంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధంపై నెతన్యాహు తాను కోరుకున్నది చేస్తారంటూ విలేకరులతో ట్రంప్ పేర్కొన్నారు. అలాగే తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కోస్ట్ గార్డ్ అకాడమీలో ట్రంప్ మాట్లాడుతూ, "యుద్ధాన్ని పూర్తి చేయాలా లేక ఒప్పందం చేయాలా అనేది ప్రశ్న. ఏం జరుగుతుందో చూద్దాం" అని అన్నారు.














Click it and Unblock the Notifications