Covishield: నో టెన్షన్: మెట్టుదిగిన బ్రిటన్: ఫలించిన భారత్ ఒత్తిడి
లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలో ఓ మహోద్యమంలా కొనసాగుతోంది. 82 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్లను వేసుకున్నారు. ఇందులో సింగిల్ డోస్ టీకా తీసుకున్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. సెకెండ్ డోస్ తీసుకోవడానికి సుమారు మూడు నెలల పాటు గడువు ఉండటమే దీనికి కారణం. రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్న వారి సంఖ్య ఒకింత పరిమితంగానే ఉంటోంది.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వినియోగిస్తోన్నది కోవిషీల్డ్. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని ఉత్పత్తి చేస్తోంది. అనేక దేశాలకు ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తోంది. కోవిషీల్డ్‌కు అధికారిక గుర్తింపు ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీన్ని వ్యాక్సిన్‌గా గుర్తించింది. అగ్రరాజ్యం అమెరికా సహా అనేక దేశాలు కోవిషీల్డ్‌ను వ్యాక్సిన్‌గా గుర్తించాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ఇంకా అలాంటి గుర్తింపు లేదు.

ఈ పరిస్థితుల మధ్య బ్రిటన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అధికారికంగా గుర్తించట్లేదంటూ చేసిన ఓ ప్రకటన కలకలం రేపింది. బ్రిటన్‌కు ప్రయాణాలు పెట్టుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గందరగోళంలో పడ్డారు. కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. తాము దాన్ని వ్యాక్సిన్‌గా గుర్తించట్లేదంటూ ప్రకటించింది బ్రిటన్ ప్రభుత్వం. దీని మీద పలు విమర్శలు సైతం తలెత్తాయి. కోట్లాదిమంది భారతీయుల నుంచి ప్రతిఘటన ఎదురైంది.
ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను రంగంలోకి దింపింది. భారత్‌లోని బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం అధికారులతో విదేశాంగ శాఖ సంప్రదింపులను నిర్వహించింది. కోవిషీల్డ్‌ను అమెరికా సహా అన్ని దేశాలు కూడా అధికారికంగా గుర్తించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అదే సమయంలో- దీనికి సంబంధించిన క్లినికల్ డేటాను సైతం అందజేసింది. బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని వివక్షతగా అభివర్ణించారు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిళ్లు ఫలించాయి. ఈ విషయంలో బ్రిటన్ మెత్తబడింది..మెట్టు దిగింది. తన ట్రావెల్ అడ్వైజరీని పునఃసమీక్షించింది. రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీని తాజాగా జారీ చేసింది. కోవిషీల్డ్‌ను అధికారికంగా గుర్తించినట్లు తెలిపింది. వచ్చేనెల 4వ తేదీ నుంచి పునఃసమీక్షించిన ట్రావెల్ అడ్వైజరీ అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, వ్యాక్స్‌జెవ్రియా, మోడెర్నా టకెద, జెన్‌సెన్‌లను తాజాగా అప్రూవ్ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications