భారత్‌ను 'వాచ్‌లిస్ట్' లో పెట్టిన అమెరికా: ఇకపై.. !!
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై గతంలో ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు.
ఈ భారీ టారిఫ్ లను తప్పించుకోవడానికి భారత్ సహా సుమారు 40 దేశాలు ఓ షాడో నెట్‌వర్క్ ద్వారా చైనాకు సహకరిస్తున్నాయని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. చైనా వస్తువులపై అదనపు టారిఫ్ భారం పడకుండా తమ దేశానికి తరలిస్తోన్నాయని విమర్శించింది. ఈ నెట్ వర్క్ మూలాలను అడ్డుకోవాలని నిర్ణయించింది. ఈ రవాణాను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సైతం వినియోగించనున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ పీటర్ నవారో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్ అనే నివేదికను ఆయన విడుదల చేశారు. చైనా అనుసరిస్తున్న అనుచిత వాణిజ్య పద్ధతులపై 2018లో ట్రంప్ ప్రభుత్వం తొలిసారిగా సెక్షన్ 301 కింద టారిఫ్ విధించిన తర్వాత.. ఈ నెట్ వర్క్ మరింత విస్తరించిందని ఇందులో పొందుపరిచారు. ఇలా టారిఫ్ భారం పడకుండా ఏటా సుమారు 40 నుంచి 303 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులు.. ఇతర దేశాల ముసుగులో అమెరికా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని అంచనా వేశారు.
చైనా తన ఎగుమతులను భారత్, మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా వంటి వివిధ దేశాల ద్వారా సులభంగా తరలిస్తోంది. ఆయా దేశాలన్నీ కూడా అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యులే. అక్కడ రీలేబ్లింగ్, రీప్యాకేజింగ్, రీఇన్‌వాయిస్ ద్వారా ఆ చైనా వస్తువులన్నింటినీ కూడా తాము ఉత్పత్తి చేసినట్లుగా చెబుతూ అమెరికాకు తరలిస్తోన్నారని, ఇలా ఇప్పటివరకు 303 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులను అమెరికాకు చేరవేసినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.
దీనికోససం భారత్ సహా ఇతర 40కి పైగా దేశాలన్నీ కలిసి ఓ షాడో ట్రాన్స్‌షిప్‌మెంట్ నెట్ వర్క్ ను రూపొందించుకున్నాయని పేర్కొంది. దీని మూలాలను గుర్తించాలని తాజాగా వైట్ హౌస్ ఆదేశించినట్లు తెలిపింది. కస్టమ్స్ అధికారుల నిఘా పరిమితంగా ఉండే ప్రాంతాలను చైనా కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని వివరించింది.
భారత్‌కు సంబంధించిన కీలక అంశాలను కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులోని పరిశ్రమలు చైనా నుంచి పెద్ద ఎత్తున పంపులు, కంప్రెషర్లను దిగుమతి చేసుకుంటోన్నాయని, వాటిని రీలేబ్లింగ్ చేసి, తమ ప్రొడక్ట్ గా చెప్పుకొంటూ అమెరికాకు ఎగుమతి చేస్తోన్నాయని ఈ నివేదిక తెలిపింది. ప్రత్యేకించి.. సిన్సినాటి, డేటన్, కొలంబస్ నగరాలకు అవి చేరుకుంటోన్నాయని, ఈ పద్ధతి ద్వారా చైనా తన ఎగుమతులను వివిధ దేశాల ద్వారా సులభంగా లాండర్ చేస్తోందని పీటర్ నవారో ఆరోపించారు.
దీన్ని అరికట్టడానికి డెటెక్టివ్ బోర్డర్ పేరుతో ఓ ఏఐ టూల్ ను వినియోగించాలని అమెరికా నిర్ణయించింది. దీని ద్వారా ఇతర దేశాల గుండా వచ్చే వస్తువుల గుట్టును గుర్తిస్తారు. యూఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారుల కోసం దీన్ని అమలు చేయనున్నామని నవారో వివరించారు. నిబంధనలను ఉల్లంఘించే కంపెనీల ఉత్పత్తులపై భారీగా పెనాల్టీలు వేయడం, వాటిని నిషేధించడం వంటి కఠిన చర్యలను తీసుకుంటామని అన్నారు.















Click it and Unblock the Notifications