లక్ష వీసాలు రద్దు.. ట్రంప్ సర్కార్ దూకుడు..
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) లో భాగంగా వీసాల జారీ ప్రక్రియపై కఠినమైన ఆంక్షలు విధించారు. అలాగే అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించేశారు. అలాగే అనేక దేశాలపై టారిఫ్ లు విధించారు. అయితే గతేడాది అమెరికా దాదాపు లక్ష వీసాలు రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ అందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.
అమెరికాలో క్రిమినల్ కార్యకలాపాలను నియంత్రించే లక్ష్యంతో అమెరికా 2025 లో లక్షకు పైగా వీసాలను రద్దు చేసింది. దీంట్లో దాదాపు 8 వేల మంది విద్యార్థులు ఉన్నారు. అమెరికా భద్రతే తమ లక్ష్యమని ఆ దేశ ప్రభుత్వం ఈ మేరకు స్పష్టం చేసింది. స్టేట్ డిపార్ట్‌మెంట్.. అమెరికాను సురక్షితంగా ఉంచడానికి ఈ క్రిమినల్స్ ను దేశం నుండి తరిమి వేయడం కొనసాగిస్తాం అని సోషల్ మీడియాలో పేర్కొంది. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొన్న 8 వేల మంది విద్యార్థులు, 2,500 మంది ప్రత్యేక వీసా దారుల పత్రాలు రద్దు చేశారు.
అలాగే.. నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారు, దోషులుగా తేలిన వారి వేలాది మంది విదేశీయుల వీసాలను రద్దు చేశారు. దొంగతనం, దాడులకు పాల్పడినవాళ్లు ఆ లిస్టులో ఉన్నారు. ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగాట్ ప్రకారం.. ఏడాదిలో లక్షకు పైగా వీసాలు రద్దయ్యాయి. దాడి, దొంగతనం, డ్రైవింగ్ అండర్ ది ఇన్‌ఫ్లుయెన్స్ (DUI) వంటి నేరాలకు పాల్పడిన వారే ఇందులో అధికంగా ఉన్నారు.
ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం.. 2025లో రద్దు చేసిన వీసాలు 2024 లోని 40 వేల వీసాల కంటే డబుల్. ప్రత్యేక వీసాదారులలో, 50 శాతం మంది మద్యం మత్తులో డ్రైవింగ్ (DUI) వల్ల, 30 శాతం మంది దాడి, నిర్బంధం ఆరోపణలతో వీసాలు కోల్పోయారు. మిగిలిన 20 శాతం మంది దొంగతనం, శిశు దుర్వినియోగం, మాదకద్రవ్యాల పంపిణీ, మోసం వంటి నేరాల వల్ల రద్దయ్యాయి.
సుమారు 500 మంది విద్యార్థులు మాదకద్రవ్యాలు కలిగి ఉండటం, పంపిణీ చేయడంలో పట్టుబడినందుకు వీసాలు కోల్పోయారు. "అమెరికా భద్రతకు ముప్పు కలిగించే విదేశీ పౌరుల నుండి దేశాన్ని రక్షించడానికి ట్రంప్ పరిపాలన అమెరికాకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుంది" అని పిగాట్ పునరుద్ఘాటించారు. కొత్త "నిరంతర పరిశీలన కేంద్రం" ద్వారా దూకుడుగా నిఘా కొనసాగిస్తామన్నారు.

మరోవైపు ట్రంప్ ప్రభుత్వం అక్రమ, చట్టబద్ధమైన వలసలపై కఠినంగా వ్యవహరిస్తోంది. పని లేదా చదువుకు అమెరికాలోకి ప్రవేశించే వారికి నిబంధనలను కఠినతరం చేసింది. ఇది విదేశీయుల పట్ల కఠిన వైఖరిని స్పష్టం చేసింది. డిసెంబర్ 15 నుండి స్టేట్ డిపార్ట్‌మెంట్ H-1B, H-4 వీసా దరఖాస్తుదారులపై పటిష్టమైన నిఘా ప్రారంభించింది, సోషల్ మీడియా ప్రొఫైల్ ల తనిఖీలు చేపడుతోంది. దీనివల్ల భారత్ వ్యాప్తంగా H-1B వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడి, విద్యార్థులు నెలల తరబడి ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications