నాలుగో బిడ్డకు తండ్రి కానున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాలుగో బిడ్డకు తండ్రి కానున్నాడు. ఆయన భార్య, భారత సంతతికి చెందిన జేడీ ఉషా వాన్స్ తల్లి కాబోతోన్నారు. ఈ విషయాన్ని జేడీ వాన్స్ వెల్లడించారు. ఈ ఏడాది జులై చివరివారం నాటికి తమ కుటుంబంలో కొత్త అతిథి రాబోతోన్నాడని, బాబు పుట్టబోతోన్నాడని తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు. ఎనిమిది సంవత్సరాల ఇవాన్, అయిదేళ్ల వివేక్, మూడు సంవత్సరాల వయస్సు ఉన్న మిరాబెల్ ఉన్నారు. ఇప్పుడు నాలుగో సంతానంగా ఉషా వాన్స్ మగబిడ్డకు జన్మనివ్వనున్నట్లు జేడీ వాన్స్ తెలిపారు. కొత్త బిడ్డ రాక తన కుటుంబంలో మరింత సంతోషాన్ని నింపుతుందని అన్నారు.

అమెరికాలో జననాల రేటు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జేడీ వాన్స్ నాలుగో బిడ్డకు తండ్రి కాబోతోండటం చర్చనీయాంశమౌతోంది. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించాలని, జనాభా క్షీణతను అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ వాన్స్ తరచుగా చెబుతుంటారు. 2021లో ఒహియో సెనేట్‌కు పోటీ చేసినపుడు.. తొలిసారి ఈ సమస్యను లేవనెత్తారు. తగ్గుతున్న జనన రేట్లు సమాజానికి, ఆర్థిక బలానికి దీర్ఘకాలిక ప్రమాదాలని హెచ్చరించారు. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కూడా దీనికే కట్టుబడి ఉన్నారు.
గత ఏడాది 'మార్చ్ ఫర్ లైఫ్' ర్యాలీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. "ఐ వాంట్ మోర్ బేబీస్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా" అని తేల్చి చెప్పారు. పదవిలో ఉండగా అమెరికా అధ్యక్షుడు గానీ, ఉపాధ్యక్షుడు గానీ తండ్రి కావడం అరుదు. గతంలో అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ భార్య ఫ్రాన్సెస్ క్లీవ్‌ల్యాండ్ 1893లో రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఓ ఉపాధ్యక్ష స్థాయి నాయకుడు తండ్రి కావడం ఇదే తొలిసారి.
We’re very happy to share some exciting news. Our family is growing! pic.twitter.com/0RohEBYXM7
— Second Lady Usha Vance (@SLOTUS) January 20, 2026
ఉషా వాన్స్.. మూలాలు భారత్ కు చెందినవే. ఆమె తల్లి లక్ష్మి చిలుకూరి శాన్ డియాగోలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఉషా, జేడీ వాన్స్ వివాహం 2014లో కెంటకీలో జరిగింది. హిందూ సంప్రదాయంలో వాళ్లు పెళ్లి పీటలు ఎక్కారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ 2025 ఏప్రిల్‌లో కుటుంబంతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. జైపూర్, ఆగ్రా సందర్శించారు.












Click it and Unblock the Notifications