ఇజ్రాయెల్ పై గెలిచాం..! అమెరికాను చాచి కొట్టాం..! సీజ్ ఫైర్ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్..!
ఇజ్రాయెల్ తో జరిగిన యుద్దంలో విజయం సాధించామని, అదే సమయంలో అమెరికాను చాచి కొట్టామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ ప్రకటించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల పాటు సాగిన యుద్ధం తాజాగా కాల్పుల విరమణతో ముగిసింది. ఇరాన్-అమెరికా అణుచర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఇజ్రాయెల్ మధ్యలో దూరి యుద్దం ప్రారంభించింది. అనంతరం ఇరాన్ కూడా సై అంటే సై అన్నట్లుగా తలపడటంతో ఇజ్రాయెల్ అమెరికా సాయం కోరడం, దీంతో ట్రంప్ బీ2 బాంబర్లను పంపి ఇరాన్ అణుస్ధావరాలపై దాడులు చేయించడం, దీనికి ప్రతీకారంగా అమెరికా వైమానిక స్ధావరాలపై ఇరాన్ దాడులకు దిగడం, చివరికి కాల్పుల విరమణతో ఈ యుద్ధం ముగిసింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తో యుద్దాన్ని బంకర్లో ఉండే నడిపించిన ఆ దేేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమైనీ ఇవాళ సీజ్ ఫైర్ తర్వాత తొలిసారి తమ ప్రజలతో మాట్లాడారు. ఇందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని, రెండు దేశాల మధ్య యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించాక తన మొదటి బహిరంగ ప్రకటనలో అమెరికా ముఖంపై చాచి కొట్టామని వ్యాఖ్యానించారు.

ఇరాన్ స్టేట్ టెలివిజన్‌లో ప్రజలనుద్దేశించి ఖమైనీ కీలక ప్రసంగం చేశారు. జూన్ 19 తరువాత ఆయన కనిపించడం ఇదే తొలిసారి. జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసి, తమ సైనిక కమాండర్లు, శాస్త్రవేత్తల్ని హతమార్చాక ఖమైనీ బంకర్లోకి వెళ్లిపోయారు. తాజాగా కాల్పుల విరమణ ప్రకటన తర్వాత రెండు రోజులకు ఆయన బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ఖమైనీ అమెరికా జోక్యం చేసుకోకపోతే యూదుల పాలన పూర్తిగా నాశనం అవుతుందని భావించింది కాబట్టి యుద్దంలో జోక్యం చేసుకుందన్నారు. అయితే అమెరికా ఈ యుద్ధం నుండి ఎలాంటి లాభం పొందలేకపోయిందన్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని ప్రకటించడం, అమెరికా జోక్యంపై వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్-అమెరికా సంబంధాల క్షీణించిన సంబంధాల తీవ్రతకు అద్దం పట్టేలా ఉన్నాయి. తాజాగా సీజ్ ఫైర్ తర్వాత వచ్చే వారం ఇరాన్ తో చర్చలు జరుపుతామంటూ నాటో సదస్సులో ట్రంప్ ప్రకటించిన తర్వాత ఖమైనీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications