Jio Crash: భగ్గుమంటోన్న యూజర్లు
అహ్మదాబాద్: ఎప్పుడెప్పుడా అంటూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు ఎదురు చూసిన ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్ గ్రాండ్ గా ఆరంభమైంది. అహ్మదాబాద్ మొతెరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. తన ప్రత్యర్థి గుజరాత్ టైటన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది సీఎస్‌కే. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగాడు. తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఒక ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు రుతురాజ్. అతను తప్ప మరే బ్యాటర్ కూడా రాణించలేదు. డెవాన్ కాన్వే-1, మొయిన్ అలీ- 23, బెన్ స్టోక్స్- 7, అంబటి రాయుడు- 12, శివం దుబే- 19, రవీంద్ర జడేజా- 1 పరుగులు చేశారు.

చివరిలో కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డాడు. 7 బంతుల్లో ఒక భారీ సిక్సర్, ఒక ఫోర్ తో 14 పరుగులు చేశాడు. దీనితో జట్టు స్కోర్ 178 పరుగులకు చేరింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ క్రీజ్ లో ఉన్నారు. సాహా 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 25 పరుగులు చేసి హంగర్గేకర్ బౌలింగ్ లో శివం దుబేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గిల్ 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
కోట్లాదిమంది అభిమానులు ఒక్కసారిగా మ్యాచ్ ను తిలకించడానికి జియో సినిమా యాప్ మీద ఆధారపడ్డారు. ఫలితంగా అది క్రాష్ అయింది. ప్రేక్షకుల లోడ్ ను అది ఏ మాత్రం తట్టుకోలేకపోయింది. బంతి బంతికీ బఫరింగ్ అవుతూ కనిపించింది. జియో బఫరింగ్ వ్యవహారం అభిమానులను చిర్రెత్తించింది. జియో క్రాష్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. #JioCrash అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ హ్యాష్ ట్యాగ్ కింద వేలాది పోస్టులు పడ్డాయి.












Click it and Unblock the Notifications