IPL 2023 : ఐపీఎల్ లో ధోనీ ప్రయోగం సక్సెస్ ! ఇంపాక్ట్ ప్లేయర్ కాస్తా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయ్యాడా ?
ఐపీఎల్ 2023 (IPL 2023 )సీజన్ ను ఓటమితో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) జట్టు నిన్న లక్నో సూపర్ జెయింట్స్ (lucknow super giants)తో జరిగిన మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టడమే కాకుండా పరువు నిలబెట్టుకుంది. అయితే ఈ రెండు మ్యాచ్ ల్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ గా కెప్టెన్ ధోనీ తెచ్చి పెట్టుకున్న పేసర్ తుషార్ దేశ్ పాండే ఇప్పుడు ఆ జట్టుకు తురుపుముక్కలా మారేలా కనిపిస్తున్నాడు.
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో అంతగా ప్రభావం చూపలేకపోయిన తుషార్ దేశ్ పాండేను మరోసారి ధోనీ తీసుకోడనే అంతా భావించారు. కానీ ఒక్క ఓటమితో టీమ్ లో మార్పులు చేర్పులు చేయడం ధోనీకి అస్సలు ఇష్టం ఉండదు. దీంతో మరోసారి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో తుషార్ దేశ్ పాండేను ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో కీలక సమయంలో ధోనీ జట్టులోకి తెచ్చాడు. అయితే వేసిన తొలి ఓవర్ లోనే 18 పరుగులు సమర్పించుకున్న దేశ్ పాండేకు మరిన్ని ఓవర్లు వేయిస్తాడా అన్నట్లుగా కనిపించిన ధోనీ.. ఏకంగా చివరి ఓవర్ నే అప్పగించాడు.

లక్నోతో మ్యాచ్ లో చివరి ఓవర్ లో 28 పరుగుల్ని అడ్డుకోవాల్సిన తరుణంలో బౌలింగ్ కు వచ్చిన తుషార్ దేశ్ పాండే ఎలాంటి ఒత్తిడి లేకుండా బంతులు విసిరాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి అప్పటికే రెచ్చిపోతున్న యువకెరటం ఆయుష్ బదానీని పెవిలియన్ కు పంపాడు. దీంతో సీఎస్కే 12 పరుగుల తేడాతో లక్నోపై గెలిచి ఐపీఎల్ 2023లో బోణీ కొట్టింది. దీంతో డెత్ ఓవర్లలో దేశ్ పాండే బౌలింగ్ ఆకట్టుకుంది. అంతే కాదు సీఎస్కేకు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ దొరికినట్లయింది.

చెన్నై జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుత బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రేవో శిక్షణలో రాటు దేలుతున్న తుషార్ దేశ్ పాండే.. ఇప్పుడు అతని తరహాలోనే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా మారడం ధోనీతోపాటు జట్టుకు పాజిటివ్ సంకేతాలు పంపుతోంది. అయితే తాను ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నానని, బ్రేవోతో తనను పోల్చుకోలేనని తుషార్ దేశ్ పాండే నిజాయితీగానే చెప్పేస్తున్నాడు. బ్రేవో తరహాలోనే డెత్ ఓవర్లతో పాటు స్లాగ్ ఓవర్లలో బౌలింగ్ చేయాలని మాత్రం కోరుకుంటున్నట్లు ఈ యువపేసర్ చెప్తున్నాడు.












Click it and Unblock the Notifications