రేవంత్ రెడ్డి మార్క్ ఫైర్: అన్ని పార్టీల కంటే ముందే: హుజూరాబాద్‌లో కొండా సురేఖ సహా
కరీంనగర్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేతగా బాధ్యతలను స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తనదైన ముద్ర వేస్తోన్నారు. దూకుడును ప్రదర్శిస్తోన్నారు. అన్ని పార్టీల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం- పార్టీకి, వ్యక్తిగతంగా తనకూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారడం, సవాళ్లతో కూడుకుని ఉండటంతో రేవంత్ రెడ్డి చురుగ్గా పావులు కదుపుతోన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహారంలోపై అధికార టీఆర్ఎస్ సహా ఏ పార్టీ కూడా ఇంకా పూర్తిస్థాయిలో కసరత్తు ఆరంభించకముందే- అక్కడ పాగా వేశారు. మండలాలవారీగా ఇన్‌ఛార్జీలను మోహరింపజేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ తరఫున ప్రాతినిథ్యాన్ని వహించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీ తరఫున ఆయనే పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. కాంగ్రెస్ నుంచి మొదట పాడి కౌశిక్ రెడ్డి పేరు విసృతంగా వినిపించినప్పటికీ.. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ ఉప ఎన్నిక బరిలో దింపుతుందనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ మరో అభ్యర్థిని వెదుక్కోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

ఈ పరిస్థితుల మధ్య అభ్యర్థి కంటే ముందుగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం ఇన్‌ఛార్జీలను నియమించారు. మండలాలవారీగా వారి పేర్లను ప్రకటించారు. సమ్వయకర్తల జాబితాను విడుదల చేశారు. హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఇన్‌ఛార్జీగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను కోఆర్డినేటర్లుగా నియమించారు. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున సమన్వయకర్తలను నియమించారు.
వీణవంక- ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట- విజయ రమణరావు, రాజ్ సింగ్ ఠాకూర్, హుజురాబాద్- టీ నర్సారెడ్డి, లక్ష్మణ్ కుమార్, హుజురాబాద్ టౌన్-బొమ్మ శ్రీరామ్, జువ్వాది నర్సింగ రావు, ఇల్లంతకుంట- నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలపూర్- కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్యలను అపాయింట్ చేశారు. వారందరినీ సమన్వయ పరుస్తూ ఏర్పాటు చేయనున్న కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జీగా కవ్వంపల్లి సత్యనారాయణను నియమించారు.












Click it and Unblock the Notifications