ఆయనకు పులివెందుల ఎంతో కుప్పం కూడా అంతే..!!
చిత్తూరు: జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎల్లుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో అడుగు పెట్టబోతోన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద మూడో విడతగా నిధులను విడుదల చేయనున్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కుప్పం పర్యటించబోతోండటం ఇదే తొలిసారి.

జగన్పర్యటన
దీనితో కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఈ నియోజకవర్గం కావడం, ఈ స్థానం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని విజయాన్ని అందుకున్న నేపథ్యంలో జగన్ పర్యటనకు రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అసలు టార్గెట్ కుప్పం..
కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటోన్నారు. వాటిని తక్షణమే కార్యాచరణలోకి తీసుకొస్తోన్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 66 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేశారు. ఇక కుప్పం పర్యటనకూ వైఎస్ జగన్ పూనుకున్నారు.

కుప్పంతోనే జైత్రయాత్ర..
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా క్లీన్ స్వీప్ చేయాలనేది వైఎస్ జగన్ లక్ష్యం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు. ఆ లక్ష్యానికి తొలి అడుగు కుప్పం నుంచే ఆరంభం కావాలని భావిస్తోన్నారు. దీనికి అనుగుణంగా తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. జిల్లాల పర్యటనను కుప్పం నుంచే ఆరంభించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

మోహరించిన మంత్రులు..
వైఎస్ జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పలువురు మంత్రులు కుప్పంలో మోహరించారు. విద్యుత్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. వైఎస్ జగన్ బహిరంగ సభ ముగిసేంత వరకూ జిల్లాలోనే ఉండనున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన మంత్రులు ఆర్ కే రోజా, ఉష శ్రీచరణ్ కూడా కుప్పంలో పర్యటించారు. ఎంపీ రెడ్డెప్ప సహా పలువురు ఎమ్మెల్యేలు కుప్పంలో మోహరించారు.

జగన్ కోసం వెయిటింగ్
సభ ఏర్పాట్లపై ఎమ్మెల్సీ, కుప్పం వైఎస్ఆర్సీపీ ఇన్‌ఛార్జ్ కేఆర్జే భరత్ విలేకరులతో మాట్లాడారు. జగన్ పర్యటన కోసం కుప్పం ఓటర్లు ఎదురు చూస్తోన్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా జగన్ పాలన సాగిస్తోన్నారని, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే పెద్ద సంఖ్యలో ఉన్నారని అన్నారు. వారందరూ వైసీపీకి అనుకూలంగా ఉంటోన్నారని, ఈ సారి కుప్పంలో విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు.

పులివెందుల ఎంతో..
వైఎస్ జగన్‌కు తన సొంత నియోజకవర్గం పులివెందుల ఎంతో.. కుప్పం కూడా అంతేనని కేఆర్జే భరత్ అన్నారు. కుప్పం ఓటర్లు ఒక మార్పు కోసం ఎదురు చూస్తోన్నారని, 2024 ఎన్నికల్లో ఆ మార్పును చూడబోతోన్నారని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలు ఒక ఎత్తయితే.. వచ్చే ఎన్నికలు మరో ఎత్తు అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ నిర్వహించబోయే సభతో ఆ మార్పునకు మొదటి అడుగు పడబోతోందని అన్నారు.












Click it and Unblock the Notifications
