ఏ ముస్లింనూ భారత్ నుంచి విడదీయలేరు: సీఏఏపై పవన్ కళ్యాణ్, చరిత్ర చెప్పారు..
కర్నూలు: వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని తాను జనసేన పార్టీని పెట్టలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. బలహీనవర్గాల గొంతుకను న్యాయదేవత దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అధికారం వచ్చినా.. రాకున్నా తనకు సంతోషమేనని అన్నారు. అధికారంలోకి వస్తే సామాన్యులకు, బలహీనులకు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కర్నూలులో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలంటూ బుధవారం నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సీఎం కావాలని కాదు.. ప్రీతికి జస్టిస్ కావాలని అడగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

రేపు కూడా కర్నూలులోనే..
సీమలో తమ పార్టీకి నాయకులు లేరని.. జనం, యువత నుంచే నాయకులను తయారు చేస్తానని అన్నారు. 11 రోజలుగా కర్నూలులో నీళ్లు రావడం లేదని తెలిసిందని అన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యారు.. పెట్టుబడులు పోయాయని అన్నారు. తాము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి లాంటి ఘటనలు లేకుండా చేయడానికేనని అన్నారు. హంద్రీనీవా ఉండి కూడా నీళ్లు రావడం లేదంటే ఇక్కడి నాయకులే కారణమని అన్నారు. తాను కర్నూలులోనే ఉంటానని, గురువారం జవహర్ నగర్ వన్ టౌన్‌కు వెళతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. హౌసింగ్ కాలనీలో ఇంకా లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వలేదని అన్నారు. పాణ్యం, ఎమ్మిగనూరు చేనేత కార్మికుల సమస్యల వినేందుకు వెళతానని చెప్పారు.

గెలిపిస్తే అండగా ఉంటా.. ఆరుగురు సీఎంలు ఏం చేశారు?
జనసేన గెలిపించుకోగలిగితే ప్రజలందరికీ అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. రాయలసీమ నుంచి ఆరుమంది సీఎంలు వచ్చారు కానీ.. సీమ ఎందుకు ఇట్లాగే ఉందని ప్రశ్నించారు. రైతులు వలసలెందుకు పోతున్నారని నిలదీశారు. ఇక్కడి నాయకులు ప్రజలు ఎప్పుడూ అడుక్కునే స్థితిలో ఉండాలని చూస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని అన్నారు.

ఏ ముస్లింనూ విడదీయలేరు..
సీఏఏతో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు పవన్ కళ్యాణ్. అన్యాయం చేస్తే తాను అడగనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు సీఏఏపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ నుంచి పాక్ విడిపోయినప్పుడు ఆ దేశం ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ఏర్పడిందని.. భారత్ మాత్రం హిందూ రాష్ట్రంగా కాకుండా సెక్యూలర్ దేశంగానే ఉందన్నారు. నేను హిందువును.. మనరక్తంలోనే సెక్యూలరిజం ఉందని అన్నారు. ఏ ముస్లింనూ భారత్ నుంచి విడదీయలేరని అన్నారు. తాను హిందువునని.. మూర్ఖపు హిందువుని కాదని, మతచాందసవాదిని కాదని అన్నారు. కులం, మతం, అన్నింటికన్నా దేశమే గొప్పదని అన్నారు.

అందుకే సీఏఏ..
దేశ విభజన సమయంలో నెహ్రూ-లియాకత్ ఓ ఒప్పందం చేసుకున్నారని.. ఆ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లోని మైనార్టీలను ఆయా దేశాలు కాపాడాలని.. అయితే, భారత్ ఆ ఒప్పందం ప్రకారం నడుచుకుంటే.. పాక్ మాత్రం ఉల్లంఘించిందని, వాళ్లు మాట నిలబెట్టుకోలేదని చెప్పారు. అందుకే సీఏఏ అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. మనదేశంలో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను చూడగలిగామన్నారు. తమ జట్టులోని హిందూ వికెట్ కీపర్‌తో తాము మాట్లాడకపోయేదని, దూరంగా ఉంచేదని షోయబ్ అక్తర్ చెప్పారని గుర్తు చేశారు. జట్టులో హిందువులందరూ ఉన్నా.. అజరుద్దీన్ కెప్టెన్సీలో పనిచేయలేదని ఎవరూ అనలేదని చెప్పారు. అలాంటి గొప్పదేశం మనదని అన్నారు. దేశం కోసం పనిచేసిన కలాం, అజరుద్దీన్ లాంటి వాళ్లను గుండెల్లో, తలపై పెట్టుకుంటామన్నారు. ఈ దేశం అందరిదీ అని అన్నారు.

సీమకు హైకోర్టే కాదు.. ఇంకా..
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడాన్ని తాను వ్యతిరేకించడం లేదన్నారు. హైకోర్టుతోపాటు నీళ్లు కావాలి, సుగాలి ప్రీతికి న్యాయం కావాలి, సీమ యువతకు ఉద్యోగాలు కావాలని కోరుతున్నానని పవన్ చెప్పారు. హైకోర్టే కాదు రాయలసీమ సమగ్ర అభివృద్ధి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. జగన్ రెడ్డికి వేల కోట్లున్నాయని.. తమకు మాత్రం జనం గుండెల్లో స్థానం ఉందని.. అదే తమ బలమని అన్నారు. సభకు సహకరించిన బీజేపీ నాయకులు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications