బట్టలు విప్పి... విద్యార్థినుల పట్ల అసభ్యంగా టీచర్లు!
విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన గురువు స్థానంలో ఉండి.. వారితో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. పాఠశాల బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతని వేధింపులు భరించలేని విద్యార్థినులు ఆందోళనలకు దిగారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాలలో చోటు చేసుకుంది.
సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాల్లో లేని అసభ్యకర విషయాలు చెబుతున్నారని విద్యార్థినులు వాపోయారు. ఈ మేరకు విద్యార్థినిలు శనివారం తరగతులు బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. అమ్మాయిలపై ఎక్కడపడితే అక్కడ చేయి వేయడం, కొట్టడం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేగాక, గత గురువారం 6వ తరగతిలో విద్యార్థులను దుస్తులు విప్పి పుట్టుమచ్చలు చూపించమని అడిగారని ఆరోపించారు. ఈ విషయాన్ని వెంటనే ప్రిన్సిపల్‌కు చెప్పామన్నారు. అయితే, ప్రిన్సిపల్ తమకు సర్ది చెప్పారని తెలిపారు. మరో ఇద్దరు ఉపాధ్యాయుల ప్రవర్తన కూడా సరిగా లేదని వాపోయారు. ప్రిన్సిపల్‌కు చెప్పినా పట్టించుకోవట్లేదని విద్యార్థినులు వాపోయారు.
ఈ విషయంపై ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని వివరణ కోరగా.. తాను ఎలాంటి దురుద్ధేశంతో ఏ పనులూ చేయలేదని, తాకలేదని చెప్పుకొచ్చాడు. చదువు, క్రమశిక్షణ పట్ల కఠినంగా ఉండాల్సి రావడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తమపై విద్యార్థినిలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మరో ఇద్దరు ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు.
కాగా, సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడి ప్రవర్తన సరిగా లేదని విద్యార్థినిలు రెండు రోజుల క్రితమే తనకు చెప్పడంతో ఆ ఉపాధ్యాయుడితో పాటు మిగిలిన వారితో తాను మాట్లాడానని ప్రిన్సిపల్ చెప్పారు. పుట్టుమచ్చలు చూసేందుకు బట్టలు విప్పమన్నారనే విషయం తన దృష్టికి రాలేదన్నారు.
విద్యార్థినుల పట్ల జాగ్రత్తగా ప్రవర్తించాలని, వారికి ఇబ్బంది లేకుండా బోధన చేయాలని ఉపాధ్యాయులను హెచ్చరించానని ప్రిన్సిపల్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. విచారణ అనంతరం తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, ఆరోపణలు నిజాలని తేలితే చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications