టీడీపీ-జనసేన నేరచరితుల చిట్టా: ఒక్కొక్కడి మీద రౌడీషీట్లు..
నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన ఘటనలో ఏడుమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. దాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఆరుమందిని అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని మద్దూరుపాడు వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కొందరు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తోన్న ఏపీఎస్ఆర్టీసీ ఏపీ 16జెడ్ 0702 నంబర్ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్‌పై ఈ దాడి జరిగింది.

కావలి దాటి, విజయవాడ వైపు వెళ్తోన్న సమయంలో బైక్ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో డ్రైవర్ హారన్ మోగించారు. దీనితో ఆ బైక్‌పై ఉన్న వ్యక్తి బస్స్ డ్రైవర్ బీ రామ్ సింగ్‌తో గొడవకు దిగాడు. ఆ సమయంలో అక్కడున్న పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఆ వ్యక్తి మాత్రం అక్కడితో దీన్ని వదల్లేదు. బస్ డ్రైవర్‌తో తాను గొడవ పడ్డ విషయాన్ని తన స్నేహితులకు తెలియజేశారు.
మొత్తం 14 మంది వ్యక్తులు కారులో బస్సును వెంబడించి అడ్డుకున్నారు. డ్రైవర్‌ను రోడ్డుపై లాగి దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. కాళ్లతో తన్నారు. అడ్డొచ్చిన వారిపైనా దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్‌ను కావలి ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. వెంటనే దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్ రెడ్డి- ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటల్లోగా ఆరుమందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తోన్నారు.
ఈ అమానవీయ దాడికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ- దాని మిత్ర పక్షం జనసేన నాయకులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో దేవరకొండ సుధీర్ బాబు, గుర్రంకొండ కిశోర్, గుర్రంకొండ అరుణ్ కుమార్, కర్రెద్దుల విజయ్ కుమార్ అలియాస్ కన్న, పుట్టా శివకుమార్ రెడ్డి అలియాస్ మహేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

వారందరిపైనా వివిధ పోలీస్ స్టేషన్లల్లో ఇదివరకే కేసులు, రౌడీ షీట్లు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేశారు. దేవరకొండ సుధీర్ బాబుపై కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 14 కేసులు నమోదై ఉన్నాయి. తుళ్లూరు, తెనాలి, చీరాల, మంగళగిరి, అరండల్ పేట, విజయవాడ పోలీస్ స్టేషన్లల్లో కేసులు ఉన్నాయి.
గుర్రంకొండ కిశోర్‌పై కావలిలో- 10 కేసులు నమోదై ఉన్నాయి. గుర్రంకొండ అరుణ్ కుమార్‌పై 2, కర్రెద్దుల విజయ్ కుమార్-9, పుట్టా శివకుమార్ రెడ్డి-8 కేసులు నమోదై ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. దాడికి పాల్పడిన మిగిలిన వారి కోసం దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications