మామూలోడు కాదు! టీఎస్‌పీఎస్సీ పరీక్షలో ఏకంగా ఓఎంఆర్ షీట్ మింగేశాడు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షలో ఓ అభ్యర్థి ఏకంగా ఓఎంఆర్ షీటునే మింగేశాడు.
నిజామాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షలో ఓ అభ్యర్థి ఏకంగా ఓఎంఆర్ షీటునే మింగేశాడు. ఇది తెలియని అధికారులు ఆ ఓఎంఆర్ షీట్ ఎలా మిస్సయ్యిందని ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గాం(పీ)లోని ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో చోటు చేసుకుంది.

తనకిచ్చిన ఓఎంఆర్ షీట్ మింగేశాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి అబ్దుల్ ముఖీద్.. డివిజనల్ అకౌంట్స్ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ అభ్యర్థులకు ఓఎంఆర్ షీట్లను అందజేశారు. పరీక్షకు హాజరుకాని అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లో కూడా పత్రాలను ఉంచారు.
అయితే, అప్పటికే పరీక్ష రాస్తున్న ముఖీద్ తనకు ఇచ్చిన ప్రశ్నలలో చాలా వరకు తప్పులు రాయడంతో.. గైర్హాజరైన పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు తెలియకుండా దొంగలించాడు. దొంగలించిన ఓఎంఆర్ పత్రంతో మళ్లీ పరీక్ష రాశాడు. ఆ తర్వాత తన ఓఎంఆర్ షీట్‌ను ముక్కలు చేసి.. నమిలి మింగేశాడు. పరీక్ష అయిపోవడంతో ఇన్విజిలేటర్లు పరీక్ష పత్రాలను తీసుకునే క్రమంలో ఒక ఓఎంఆర్ షీట్ కనిపించట్లేదని గుర్తించారు.

సీసీ కెమెరాలో బయటపడిన ముఖీద్ బండారం
వెంటనే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పరీక్షా కేంద్రంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీని పరిశీలించారు. దీంతో ముఖీద్ బండారం బయటపడింది. మరొకరి ఓఎంఆర్ షీట్లో పరీక్ష రాసి.. తన ఓఎంఆర్ షీటును మింగేసినట్లు అధికారులు గుర్తించి విస్తుపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్దుల్ ముఖీద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. తానే ఓఎంఆర్ షీట్ ను మింగేసినట్లు ముఖీద్ ఒప్పుకున్నాడు. దీంతో ముఖీద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
ఇది ఇలావుండగా, టీఎస్ పీఎస్సీ నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి జరిగిన రాత పరీక్షలో 63 శాతం మంది హాజరయ్యారు. 1,06,253 మంది అభ్యర్థులు చేసుకోగా.. ఆదివారం ఉదయం పేపర్-1 పరీక్షకు 67,830 మంది హాజరు కాగా, మధ్యాహ్నం పేపర్-2కు 66,903 మంది హాజరయ్యారు. ఓఎంఆర్ షీట్ మింగిన ముఖీద్ తోపాటు మరో మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications