ఆ జిల్లా ప్రజల సెంటిమెంట్లను గౌరవించిన జగన్ సర్కార్: పేరు మార్పు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలంలో ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన భావనపాడు పోర్ట్ పేరు మారింది. దీన్ని మూలపేట పోర్ట్‌గా నామకరణం చేసింది. ఈ మేరకు పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాళ వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అందిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ పోర్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ఇదివరకే పూర్తి చేసింది. ఏపీ మారిటైమ్ బోర్డ్ ఆధ్వర్యలో రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ సైతం పూర్తయింది. కొత్త డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం తొలిదశలో 3,600 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. ఫేస్-1 నిర్మాణ పనులను విశ్వ సముద్ర గ్రూప్‌నకు అప్పగించింది.

సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల కార్గో లావాదేవీలను నిర్వహించగల సామర్థ్యంతో నాన్-మేజర్ పోర్టును నిర్మించాలని 2012లో ప్రభుత్వం భావించింది. దీనికోసం ఏపీ మారిటైమ్ బోర్డ్ పర్యవేక్షణలో భావనపాడు పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఈ పోర్ట్ నిర్మాణం కోసం 5,000 ఎకరాల భూమిని సేకరించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ తరువాత దీన్ని 2,217 ఎకరాలకు కుదించింది. ఇందులో అధికశాతం భూములు భావనపాడుకు బదులుగా మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందినవే కావడం వల్ల భావనపాడుకు బదులుగా మూలపేట పోర్ట్‌గా పేరు పెట్టింది ఏపీ ప్రభుత్వం. గతంలో భావనపాడు వద్ద పోర్టు నిర్మాణాన్ని ప్రతిపాదించినప్పటికీ కొత్త డీపీఆర్ ప్రకారం మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు మార్చినందున కొత్త పేరు పెట్టాల్సి వచ్చిందని వివరించింది.
కొత్త డీపీఆర్ ప్రకారం సంతబొమ్మాళి మండలం నౌపాడలో 80 కోట్ల రూపాయల అంచనాతో పునరావాస కాలనీని కూడా నిర్మిస్తోంది. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 600 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద నిర్మిస్తోన్న ఈ ఇళ్లను మంజూరు చేసింది. ఎల్లుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మూలపేట వద్ద జగన్ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications