మల్లా రెడ్డి సహా 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి?: పేర్లు కూడా చెప్పిన దానం
త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీని ముంచాయన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం దానం నాగేందర్ మాట్లాడారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు చాలా మంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు దానం నాగేందర్. అంతేగాక, కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ పలువురి పేర్లను కూడా చెప్పారు.

కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ చేరిక ఉంటుందని దానం నాగేందర్ చెప్పారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కీలక నేత సునీల్ కనుగోలు ఈ చేరికలపై రెండు మూడు రోజులుగా చర్చించారని దానం తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్‌లు తప్ప.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరని అన్నారు. హరీశ్ రావుతో కొందరు బీజేపీకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకత్వంలో అయోమయంలో పడిందని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
కాగా, ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. దీంతో మరిన్ని చేరికలుంటాయనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications