కేటీఆర్ బైంసా రోడ్ షోలో ఉద్రిక్తత: 23 మందిని అరెస్ట్ చేశామన్న ఎస్పీ
నిర్మల్: గురువారం రాత్రి భైంసా పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో టమాటాలు, ఉల్లి, ఆలుగడ్డలు విసరడంతో ఉద్రిక్త చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 23 మందిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం వెల్లడించారు. ఘటనపై భైంసా పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. గురువారం రాత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచార సమయంలో ఉద్రిక్తతకు దారి తీసిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. ఉద్రిక్తతకు కారకులైన వ్యక్తులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి, అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రచారంలో ఉద్రిక్తతలకు బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలు సంయమనం పాటించి, ఎటువంటి వదంతులు నమ్మొద్దని ఆమె సూచించారు. భైంసా అంత ప్రశాంతంగానే ఉందని, ఇక్కడ ఎలాంటి గొడవలు జరగడం లేదని తెలిపారు. పట్టణంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. నిందితులందరినీ నిర్మల్ న్యాయస్థానానికి పంపించి, అక్కడి నుంచి ఆదిలాబాద్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
గురువారం రాత్రి ఏం జరిగిందంటే?
నిర్మల్ జిల్లా భైంసాలో కేటీఆర్ ప్రచారం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్న కేటీఆర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, టమాటలు విసిరారు. ఇలాంటి చిల్లర పనులు చేయొద్దంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బహిరంగంగానే దాడి జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేటీఆర్ మండిపడ్డారు. పోలీసులు ఉన్నారా.. దమ్ము ధైర్యం లేదా? అంటూ ప్రశ్నించారు. కాగా, కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు కొందరు రామభక్తులు. ఇటీవల 'జైశ్రీరాం' అంటే అన్నం దొరుకుతుందా? అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications