రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య: వేటకొడవళ్లతో వెంటాడి చంపారు
సూర్యాపేట: జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శశిధర్ రెడ్డి(47)ను కొందరు దుండగులు హత్య చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో తన వ్యవసాయ క్షేత్రానికి డ్రైవర్ నరేష్ తో కలిసి శశిధర్ రెడ్డి కారులో బయల్దేరారు. కారు దిగి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తుండగా.. పది నిమిషాల వ్యవధిలోనే సుమారు ఆరుగురు దుండగులు ఆటోలో వచ్చి వేటకొడవళ్లతో శశిధర్ రెడ్డిని వేటాడి చంపారు.

ఆ తర్వాత అతని మృతదేహాన్ని సమీపంలోని ఓ మడుగులో పడేసి అక్కడ్నుంచి నిందితులు పరారయ్యారు. డ్రైవర్ నరేష్ ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. జాగిలాలతో పరిశీలించారు.
డీఎస్పీ మోహన్ కుమార్, సీఐ విఠల్ రెడ్డి, ఎస్ఐ లోకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన భార్య, కొడుకు హత్య కేసులో శశిధర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మరో హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. ఇవేగాక, వ్యాపార తగాదాలు కూడా శశిధర్ రెడ్డి హత్యకు కారణమై ఉండొచ్చని స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, రియల్టర్ శశిధర్ రెడ్డి హత్య స్థానికంగా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications