హెచ్ఎండీఏలో అవినీతి తిమింగలం: రూ. 100 కోట్లపైనే అక్రమాస్తులు, వందకుపైగా వాచ్‌లు, మొబైల్స్
హైదరాబాద్: హెచ్ఎండీఏలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఆయన మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి, రెరాలో కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో 14 బృందాలు.. శివబాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేశాయి.
ఇప్పటి వరకు రూ. 100 కోట్లకుపైగా స్థిర, చర ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే, ఇంకా బాలకృష్ణకు సంబంధించిన బ్యాంక్ లాకర్లు తెరవాల్సి ఉండటం గమనార్హం. దీంతో అందులోనూ భారీగా ఆస్తులుండే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఇప్పటి వరకు రూ. 40 లక్షల నగదు, రెండు కిలోల బంగారం, స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, 100కుపైగా ఖరీదైన చేతి గడియారాలు, 14 మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు గుర్తించారు.

మొత్తంగా 100 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. బాలకృష్ణ నివాసంలో క్యాష్ కౌంటింగ్ మెషీన్లను కూడా అధికారులు గుర్తించారు. నాలుగు బ్యాంక్ లాకర్లు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ తనిఖీలు గురువారం కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
హెచ్ఎండీఏలో ఉన్నప్పటి నుంచే ఈ ఆస్తులన్నీ కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. బ్యాంక్ లాకర్లు, బంధువుల ఇళ్లలో సోదాలు ముగిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతల అండదండలతో రూ. కోట్లు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఏకకాలంలో ఏసీబీ ప్రారంభించింది. భారీ మొత్తంలో లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు బాలకృష్ణ అభియోగాలున్నాయి.












Click it and Unblock the Notifications