బాబు ఆడియో టేప్ లీక్: టీ న్యూస్‌కు జారీ చేసిన నోటీస్ పాఠం
హైదరాబాద్: టీ న్యూస్ చానెల్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పోలీసులు నోటీసు జారీ చేయడం ఆందోళనకు దారి తీసింది. తెలంగాణలో జర్నలిస్టులు దానిపై తీవ్రంగా మండిపడుతూ ఆందోళన బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌తో జరిపినట్లు చెబుతున్న సంభాషణల ఆడియో టేప్‌ను ప్రసారం చేసినందుకే ఆ నోటీసులు జారీ చేశారు.
స్థానిక పోలీసులకు చెప్పకుండా నోటీసు జారీ చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు అంటున్నారు. టీ న్యూస్‌కు అర్థరాత్రి పూట నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ నోటీసులు పూర్తి పాఠం ఇలా ఉంది...

‘కేబుల్ టీవీ నెట్ వర్క్ నియంత్రణ చట్టం-1995లోని సెక్షన్ 19 మేరకు ఈ నోటీసు జారీ చేస్తున్నాం. టీ న్యూస్ పేరిట మీరు నడుపుతున్న ఛానెల్ ఏపీ, తెలంగాణల్లోని కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ నిబంధనల పరిధిలోకి వస్తుంది. సంబంధిత చట్టంలోని ప్రోగ్రామ్ కోడ్‌కు అనుగుణంగా కార్యక్రమాలు ఉండాలి. కానీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణకు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో మాట్లాడినట్లుగా ఈ నెల 7వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో మీరు ఒక వార్తను ప్రసారం చేశారు.
మీరు ప్రసారం చేసిన కథనంలోని అంశం ఏపీతో పాటు తెలంగాణలోని ప్రజల్లో సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉంది. దీని ద్వారా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు, రాజకీయ పార్టీల మధ్య శత్రుభావం, విద్వేషాలను రేకెత్తించారు. ఏపీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధిపతి ప్రతిష్టను దెబ్బతీస్తూ పదేపదే ఆ దృశ్యాలను ప్రసారం చేశారు. అది కేబుల్ టీవీ చట్టంలోని ప్రోగ్రామ్ కోడ్‌కు భిన్నంగా వ్యవహరించడమే కాక పరువు నష్టం కలిగించేలా, తప్పుడు, అసత్యంతో కూడిన కథనాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రసారం చేశారు. దీనికి సంబంధించి తగిన చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో 3 రోజుల్లోగా వివరణ ఇవ్వగలరు'.












Click it and Unblock the Notifications