జైల్లోనూ తగ్గట్లేదు: దర్జాగా 'సెటిల్‌మెంట్స్', ఏఎస్ఐ మోహన్ రెడ్డి వీడియో లీక్..
కరీంనగర్: పోలీస్ బాసులను సైతం తన దందాలో పెట్టుబడులు పెట్టించేలా చేసి.. భారీ ఎత్తున వడ్డీ దందాకు పాల్పడిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. జైలుకెళ్లినా మోహన్ రెడ్డి తీరులో మాత్రం మార్పు రాలేదు.

మేనేజ్ చేస్తున్నాడా?:
పోలీసు బాసులనే మేనేజ్ చేసి దందా నడిపించిన మోహన్ రెడ్డికి.. జైల్లో అధికారులను మేనేజ్ చేయడం పెద్ద కష్టమేమి కానట్టే అనిపిస్తోంది. తాజాగా బయటకు లీకైన ఓ వీడియో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. జైలు కేంద్రంగానే మోహన్ రెడ్డి తన దందాలను చక్కదిద్దుకుంటున్నట్టు వీడియో ద్వారా తెలుస్తోంది.

సూపరిండెంట్ గదిలోనే:
జైల్లోని సూపరిండెంట్ గదిలోనే కుటుంబ సభ్యులతో ములాఖత్ అయిన మోహన్ రెడ్డి.. సెటిల్ మెంట్ విషయాలు వారితో చర్చించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు లీకైంది. అయితే వీడియో తీసిన వ్యక్తి ఎవరన్నది ఇంతవరకు తెలియలేదు.

విచారణలో డొల్ల?:
జైలు కేంద్రంగానే ఏఎస్ఐ మోహన్ రెడ్డి తన దందా నడిపిస్తున్నాడంటే.. ఆయనపై అంతర్గత విచారణ ఎంత ఉదాసీనంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఒక ఏఎస్ఐ స్థాయి అధికారి వందల కోట్ల డబ్బును పోగేయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది.
అధిక వడ్డీలకు డబ్బులివ్వడమే కాకుండా.. సకాలంలో తీర్చకపోతే వారిని వ్యక్తిగతంగాను మోహన్ రెడ్డి వేధించాడన్న ఆరోపణలున్నాయి.కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత ఆత్మహత్యతో మోహన్ రెడ్డి దందా అప్పట్లో వెలుగులోకి వచ్చింది.

పోలీస్ అధికారులపై వేటు:
మోహన్ రెడ్డికి 40మంది బినామీలు ఉన్నట్టు అప్పట్లో గుర్తించారు. ఆయన దందాలో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు బాసులపై అప్పట్లో బదిలీ వేటు కూడా పడింది. అప్పటి ఏఎస్పీ జనార్థన్‌రెడ్డిపై వేటు వేసిన పోలీస్ బాస్ ఇప్పుడు మరో ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేశారు. హుజూరాబాద్ డీఎస్పీ సంజీవ్‌కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్‌రావులపై కూడా అప్పట్లో వేటు పడింది.












Click it and Unblock the Notifications