బీటెక్ చదివాడు, ఉద్యోగం కోసం వచ్చి చైన్ స్నాచర్ అయ్యాడు
హైదరాబాద్: ఉద్యోగం సంపాదించేందుకు గొలుసు చోరీకి పాల్పడిన బీటెక్ చదివిన యువకుడిని అరెస్ట్ చేసిన సంఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన మిరియాల రవికుమార్ నల్గొండలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశాడు.
ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. ఉద్యోగం లభించకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. ఖర్చులకు రెండు నెలల నుంచి ఇంటి నుంచి డబ్బులు రావడం లేదు. ఖర్చులకు డబ్బు లేకపోవడంతో నేరాల బాట పట్టాడు. చైన్ స్నాచింగ్ చేసి కటకటాలపాలయ్యాడు.

ఇతను నగరంలో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. కన్సల్టెన్సీలను సంప్రదించగా పెద్ద మొత్తంలో డబ్బు కట్టాలని చెప్పారు. ఏం చేయాలో తోచక సులభంగా డబ్బు సంపాదించాలనుకుని నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
అల్కాపురి చౌరస్తా సమీపంలో ఇటీవలే చైన్ స్నాచింగ్ చేశాడు. అతడు చోరీ చేసింది రోల్డ్ గోల్డ్. సాయి సప్తగిరి కాలనీలో ఉండే బాల్ రెడ్డి కుమార్తె సుజాత దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ సంస్థలో మల్టీ మీడియా కోర్సు చేస్తోంది. ఈనెల 16వ తేదీ రాత్రి 8.15 గంటలకు రాక్‌టౌన్-కామినేని చౌరస్తా దారిలో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద సంస్థ నుంచి వస్తున్న ఓ వ్యక్తి కోసం బైక్ పైన వేచి ఉంది.
అదే సమయంలో రవి కుమార్ నడుచుకుంటూ వెళ్తూ ఆమె మెడలోని రెండుతులాల బంగారు గొలుసు తెంచుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. 18వ తేదీ రాత్రి చాణక్యపురి కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు.












Click it and Unblock the Notifications