కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోండి: సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ, అభినందన
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను ప్రస్తావించడం అభినందనీయమన్నారు బండి సంజయ్.
ఈ మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో సంజయ్ ప్రస్తావించారు.ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ. 5.04 లక్షలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నీలోజిపల్లి నుంచి నందిగామ ఆగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ తోపాటు స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు.

అంతేగాక, అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సహా మాజీ కేసీఆర్ కుటుంబ సభ్యులై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇందుకోసం తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ను బండి సంజయ్ కోరారు.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆయన కరీంనగర్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తనదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా పదికిపైగా పార్లమెంటు స్థానాలు దక్కించుకునేందుకు బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది.












Click it and Unblock the Notifications