రాహుల్ వ్యాఖ్యలకు ఉగ్రవాదుల మద్దతా?: బండి సంజయ్ సంచలనం
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నగరంలోని రాంగోపాల్‌పేట్‌లోని పలు వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ ఆయన స్థానికులతో సభ్యత్వ నమదు చేయించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సాఫీగా సాగుతుందని చెప్పారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెరలేపారని బండి సంజయ్ ఆరోపించారు. దేశద్రోహ, సంఘ విద్రోహ శక్తులైన ఉగ్రవాద సంస్థలు.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు, రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఇటాలియన్ కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ దేశాన్ని వదిలి వెళ్లాలన్నారు బండి సంజయ్. ఆరు గ్యారంటీల నుంచి దృష్టి మరల్చేందుకే హైడ్రా పేరుతో కొత్త నాటకానికి తెర లేపారని మండిపడ్డారు. పేద ప్రజల విషయాల్లో హైడ్రా వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని ధ్వజమెత్తారు అప్పట్లో అనుమతులు ఇచ్చిన అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైడ్రా కూల్చివేతలు ఎలా ఉండాలంటే?: ఎంపీ అరవింద్
హైడ్రా కూల్చివేతలు నిష్పక్షపాతంగా ఉండాలన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. లౌకిక పార్టీ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ 'సెక్యులర్ హైడ్రాను' నడిపించాలని డిమాండ్ చేశారు. కబ్జా నిర్మాణాలను ఎంపిక చేసి కూల్చడం మాత్రమే కాకుండా ప్రణాళికాబద్దంగా నేలమట్టం చేయాలని సూచించారు.
హైడ్రా పాత బస్తీకి వెళ్లడానికి వెనకడుగు వేస్తుందని దుయ్యబట్టారు. రెండు రోజులకోసారి హైడ్రా విధానం మారకూడదని అరవింద్ హితవు పలికారు. కాగా, అసెంబ్లీలోని బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎల్పీసమావేశం నిర్వహించారు. ఎల్పీనేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాజాసింగ్ మినహా బీజేపీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో పది అంశాలపై చర్చించినట్లు పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అర్హులకు రేషన్ కార్డులు, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.అంతేగాక, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని సెప్టెంబర్ 20న 'రైతు దీక్ష' చేయాలని నిర్ణయించినట్లు మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో 'శ్వేతపత్రం' విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా కేంద్రాన్ని నిందించడం సరికాదన్నారు బీజేపీ నేతలు.












Click it and Unblock the Notifications