కేఎంసీలో ప్రీతి ఘటన మరచిపోకముందే మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!!
వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ప్రీతీ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే మరో ఘటన కేఎంసీలో చోటు చేసుకుంది. కాకతీయ మెడికల్ కళాశాలలో లాస్య అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వైద్య విద్యార్థిని లాస్య కూడా పీజీ విద్యార్థిని కావడం గమనార్హం.
కాకతీయ వైద్య కళాశాలలో పీజీ ఆర్థోపెడిక్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది లాస్య. ఆమె స్వస్థలం హైదరాబాద్ కాగా అసలు లాస్య ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది అన్నది తెలియాల్సి ఉంది. పీజీ విద్యార్థిని లాస్య గత కొంత కాలంగా మైగ్రేన్ తో బాధ పడుతుంది అని, నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో విధులు నిర్వహించి తలనొప్పి ఎక్కువగా ఉండటంతో నిద్రమాత్రలు వేసుకుందని చెప్తున్నారు.

నిద్ర మాత్రల డోస్ ఎక్కువ కావడంతో లాస్య స్పృహ కోల్పోయింది అని ఆమె సహచర వైద్య విద్యార్థులు చెప్తున్నారు.ఎంజీఎం ఆస్పత్రిలో ని ఆర్ ఐ సి యూ విభాగంలో ఎంజీఎం వైద్యులు లాస్య కు చికిత్స అందిస్తున్నారు. గతంలో ప్రీతి ఘటన చోటు చేసుకోవడంతో ఇప్పుడు లాస్య సంఘటన బయటికి రాకుండా ఎంజీఎం ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేస్తున్నారు.
ప్రీతి ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లాస్య తలనోప్పితోనే నిద్రమాత్రలు వేసుకుందా? లేక కేఎంసీలో మళ్ళీ ఏమైనా వేధింపులు కొనసాగుతున్నాయా? అన్నది అందరినీ ఆలోచించేలా చేస్తుంది. ఏది ఏమైనా ఆమె నిద్ర మాత్రలు వేసుకోవటానికి గల అసలు కారణాలు బయటకు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications