మావోయిస్టులకు భారీ దెబ్బ! 86 మంది నక్సల్స్ లొంగుబాటు
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మార్చి నెలలో 64 మంది మావోయిస్టులు లొంగిపోగా.. తాజాగా 86 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో లొంగిపోయారు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ సంఖ్యలో సరెండర్లు జరిగాయని ఐజీ తెలిపారు.
కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలనే పిలుపునకు తోడు, మావోయిస్టు అగ్ర నాయకుల వేధింపులు, వసూళ్లకు తట్టుకోలేక వీరంతా లొంగిపోయినట్లు ఐజీ పి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం నుంచి 4, పార్టీ నుంచి 4, మిగతా వారు రకరకాల సంఘాల మిలీషియా సభ్యులు ఉన్నారని తెలిపారు. జిల్లాకు చెందిన వారు 81 మంది కాగా, ములుగు జిల్లాకు చెందినవారు ఐదుగురు ఉన్నట్లు తెలిపారు.

లొంగిపోయిన వారిలో ఏసీఎం సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష, మిగతా సభ్యులకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఐజీ పి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసంతో పాటు అన్ని ప్రోత్సాహకాలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర పోషించిన కొత్తగూడెం, సీఆర్‌ఫీఎఫ్ పోలీసుల చొరవను అభినందించారు.
తెలంగాణ ప్రాంతంలో ఇంకా, 95 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. కాగా, మావోయిస్టులతో శాంతి చర్చల విషయం ప్రభుత్వ నిర్ణయాల మేరకు ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకు వెళతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications