బండి సంజయ్ కుమారుడి కేసులో ట్విస్ట్- హైకోర్టులో పిటీషన్
తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ సాయి లైంగిక వేధింపుల కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల వ్యవహారంలో పోక్సో కేసును ఎదుర్కొంటోన్న భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని తాజాగా పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టుగా భావిస్తోన్న భగీరథ్ హఠాత్తుగా ఈ పిటీషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 14వ తేదీన విచారణ చేపట్టనుంది. హైకోర్టు వెకేషన్ బెంచ్ సమక్షానికి రానుందీ మధ్యంతర బెయిల్ పిటీషన్. ప్రభుత్వం, బండి భగీరథ్ వాదనలను సమ్మర్ వెకేషన్ బెంచ్ ఆలకించనుంది. ఇందులో బాధితురాలి కుటుంబం ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 14న లిస్టింగ్ అయిన నేపథ్యంలో పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది తన వాదనలను వినిపించనున్నారు.

కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం విచారణ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. పోక్సో కేసు దర్యాప్తు అధికారిణిగా కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్‌ను నియమితులయ్యారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ లో భగీరథ్‌పై ఈ కేసు నమోదైంది. ఈ మేరకు సోమవా రం ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసును గైక్వాడ్ దర్యాప్తు చేయనున్నారు.
ఈ అంశంపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విజ్ఞప్తి చేశారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లలో పాల్గొనని ఏదేని సీనియర్ ఐపీఎస్ అధికారిని ఈ కేసు విచారణకు నియమించాలని కోరారు. బండి సాయి భగీరథ్‌పై లుకౌట్ నోటీసు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్, బీజేపీ కార్యకర్త సంగప్పను కూడా కేసులో చేర్చాలని, బాలిక కుటుంబంతో రాజీ కుదిర్చే ప్రయత్నాల్లో వీళ్లిద్దరూ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు మాత్రం ఈ కేసును చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోన్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని కుటుంబ వ్యవహారంగా అభివర్ణించడం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. పార్టీకి దీనితో ఎటువంటి సంబంధం లేదని పేర్కొంటూ ఆ కేసు నుంచి దూరం ఉండాలని ప్రయత్నించింది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఓ స్పష్టత సైతం ఇచ్చారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అని, ఆయన కుమారుడికి ఏదైనా ప్రమేయం ఉంటే పోలీసులు విచారిస్తారని తెలిపారు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications