రూ. లక్షా 50 వేల కోట్లతో పెద్ద స్కెచ్: రేవంత్ సర్కారుపై ఈటల రాజేందర్ సంచలనం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని.. పెద్ద స్కెచ్ వేసుకుని రంగంలోకి దిగారని ఆరోపించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం లాంటివి అయిపోయాక ఇక డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఆలోచన చేసి.. మూసీ ప్రక్షాళనను తెరమీదకు తీసుకొచ్చారన్నారు.
లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన చేస్తామని అంటున్నారు.. పెద్ద స్కెచ్ వేసుకుని రంగంలోకి దిగారని రేవంత్ రెడ్డి సర్కారుపై ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో చెరువులు మురికి నిలయాలుగా ఉన్నాయని.. వాటి పక్కకు ఉండటం ఒక శాపమైనా.. దిక్కులేక ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవి చక్కగా చేయలేదు.. ఎంపీగా గెలిపిస్తే మల్కాజిగిరిని పట్టించుకోలేదని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఒక మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదని.. చెరువులంటే అవగాహన లేదని అన్నారు. ఫార్మాసిటీ కోసం 13 వేల ఎకరాల భూములు సేకరించారు. రింగ్ రోడ్డు కోసం ప్రాజెక్టుల కోసం భూమిని సేకరిస్తున్నారు. అలాగే చెరువులను కాపాడేందుకు కూడా పట్టా భూములను సేకరించి, వారికి ప్రత్యామ్నాయం చూపించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
అవేమీ లేకుండా కట్టుకున్న ఇళ్లను కూలగొడతా అంటే న్యాయం అవుతుందా? అని ఈటల ప్రశ్నించారు. బిల్డర్లకు వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న అని కొంతమంది అంటున్నారని మండిపడ్డారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితం కొట్లాటనే అని.. అది కూడా పేదల కోసమేనని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి.. చివరకు కేసీఆర్‌తో కూడా కొట్లాడనని ఈటల తెలిపారు. పేదల కోసం ముఖ్యమంత్రులతో కొట్లాడిన కమిట్‌మెంట్ తనదని చెప్పారు.
రేవంత్ రెడ్డిని గెలిపించింది ప్రజలకు బాగు చేస్తారని కానీ.. ఏడిపిస్తారని కాదన్నారు ఈటల రాజేందర్. ప్రజల కన్నీళ్లు చూసి నవ్వుతున్న రేవంత్ రెడ్డి ఒక సైకో.. శాడిస్ట్ మెంటాలిటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను తిరగని చెరువు లేదు.. పలకరించని బాధితుడు లేడన్నారు. ఇంకా పిచ్చి పని ఈ ముఖ్యమంత్రి చేస్తాడని అనుకోవడం లేదన్నారు. జ్ఞానోదయమై సమీక్ష చేసి దీనికో పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయాలే తప్ప మీ తాత జాగీర్ లాగా వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ లోని నారాయణ చెరువును పరిశీలించి FTL ముంపు ప్రాంతంలోని బాధితులతో మాట్లాడి భరోసా ఇవ్వడం జరిగింది.
— Eatala Rajender (@Eatala_Rajender) September 28, 2024
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్, నాయకులు వై సుదర్శన్ రెడ్డి, శేఖర్ యాదవ్,… pic.twitter.com/HubhDxUssD
'నిన్ను (రేవంత్ రెడ్డి) ముఖ్యమంత్రి ఎందుకు చేసామా అని నీకు మద్దతు ఇచ్చిన వారందరూ బాధపడుతున్నారు. పట్టా భూముల్లో ఎవరైనా చెయ్యి పెడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాను. పర్మిషన్లు ఇచ్చిన నాటి ముఖ్యమంత్రిగా తప్పు చేశారని ముక్కు నేలకు రాశాక ఇల్లు కూలగొట్టు. అనేకమంది సీఎంలను చూశాము నిన్ను కూడా చూస్తున్నాము. మంచి పనులు చేస్తే గుండెలో పెట్టుకుంటారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే బండకేసి కొడతారు' అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
ఎంపీ ఎన్నికల్లో తాను వచ్చే సమయం లేక రాకపోయినా.. తనకు సంపూర్ణ మద్దతిచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈటల రాజేందర్. మల్కాజిగిరి ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని అన్నారు. టెక్నికల్ గా గెలిచింది ఈటల రాజేందర్ కావచ్చు.. కానీ, గెలిచింది మల్కాజిగిరి ప్రజలేనని అన్నారు. పీర్జాదిగూడలో మంచినీటి సమస్యలు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. పీర్జాదిగూడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.












Click it and Unblock the Notifications