హీరోయిన్లను నేను బెదిరించుడేంది- నాకు ఆ ఖర్మేంది: కేటీఆర్ ఫైర్
KTR: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఉధృతమౌతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా అన్ని మెజారిటీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశాయా పార్టీలన్నీ. ప్రచార కార్యక్రమాలతో రాష్ట్రాన్నిహోరెత్తిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య .. ఫోన్ ట్యాపింగ్ వివాదాలు బీఆర్ఎస్‌ను చుట్టుముట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారంలో ఉన్నప్పుడు కొందరు కీలక నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలను ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కొందరు టాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడికి దిగారు. తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ ఫోన్ ట్యాపింగ్ నాటకాన్ని తెర మీదికి తెచ్చారంటూ విమర్శించారు. కేసీఆర్ పొలంబాట పట్టి ప్రభుత్య చేతగానితనాన్ని బయట పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దిక్కుతోచట్లేదని ధ్వజమెత్తారు.
ఫోన్ ట్యాపింగ్ వివాదంలో ఒక్క కేసిఆర్ మాత్రమే బాధ్యుడా అంటూ నిలదీశారాయన. ఫోన్ ట్యాపింగ్‌పై 2004 నుంచీ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. 2004లో కూడా అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వంపైనా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చాయని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తన వ్యక్తిగత ప్రతిష్ఠను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోన్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై తనపేరును ప్రస్తావించడాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారాలతో సంబంధం లేదని, ఎవరో హీరోయిన్లను తాను బెదిరించాననడంలో అర్థం లేదని, అంత ఖర్మ పట్టలేదని పేర్కొన్నారు.

తనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ చెత్త మాటలెవరైనా మాట్లాడితే మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా తాట తీస్తామని హెచ్చరించారు. చట్టపరంగా అన్నింటినీ ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి అధికారులు రవిగుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి బాధ్యులు కాదా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి దమ్ముంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే ప్రకటించాలని, అవి చేతగాకపోవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వివాదంతో కాలయాపన చేస్తోన్నారంటూ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ పదవులు ఊడటం ఖాయమని కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించారు.
పార్టీ మారిన వారిపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయడానికి ఈ ఆదివారం వరకు స్పీకర్‌కు గడువు ఇస్తున్నామని, ఆ లోగా నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications