పర్సనల్ సెక్యూరిటీ అరెస్ట్: తనపై కక్షకట్టారంటూ చీకోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: క్యాసినోలు నిర్వహిస్తూ గతంలో పోలీసులకు చిక్కిన చీకోటి ప్రవీణ్ మరోసారి వార్తలో నిలిచారు. బోనాల సందర్భంగా లాల్‌దర్వాజ అమ్మవారిని ఆదివారం చీకోటి ప్రవీణ్ దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది గన్‌తో ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది వద్ద గన్‌ను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గన్ లైసెన్స్‌లపై ఆరా తీస్తున్నారు ఛత్రినాక పోలీసులు. కాగా, గన్ మెన్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ చైతన్య తెలిపారు. పబ్లిక్ ప్లేసుల్లో గన్‌లు బయటకు తీయడం నిబంధనలకు విరుద్ధమని, అందుకే గన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గన్ మెన్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ స్పందించారు. పోలీసులు అత్యుత్సాహంతో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. తన వ్యక్తిగత సిబ్బందికి గన్ లైసెన్స్ ఉందని చెప్పినా నిర్ధారించుకోకుండా.. పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఈ విషయంలో తనకు గన్‌లతో కూడిన వ్యక్తిగత భద్రత సిబ్బంది ఉన్నారనే విషయం అందరికీ తెలుసునని చెప్పారు. కానీ, ఈరోజే పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తించారో తెలియడం లేదని వివరించారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం మాత్రమే వచ్చానని.. ఆలయం లోపలికి గన్స్‌తో వెళ్లలేదని చెప్పారు.
తనకు ప్రాణహాని ఉన్న కారణంగానే బారికేడ్స్ వరకు సెక్యూరిటీతో వెళ్లానని చీకోటి ప్రవీణ్ తెలిపారు. అన్ని అనుమతులతో గన్స్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. తాను హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. తన వద్ద ఉన్న అనుమతి పత్రాలు పోలీసులకు ఇస్తానని చెప్పారు. అంతేగాక, త్వరలో రాజకీయాల్లోకి వస్తానని తెలియడంతో కొందరు తనపై కక్ష కట్టారని ప్రవీణ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications