ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్: తీవ్ర గాయమన్న వైద్యులు, నేడు దుబ్బాక బంద్
హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని యశోద ఆస్పత్రిలో సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ పరామర్శించారు. నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభ అనంతరం నేరుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్ వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు వైద్యులు వివరించారు.
మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావును సీఎం ఆదేశించారు. ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేసీఆర్. ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని సీఎం పేరొన్నారు.

కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం సంఘటన దురదృష్టకరమని కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం పేరొన్నారు. హాస్పిటల్ కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు , కార్యకర్తలకు కూడా ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ మధుసూదనా చారి తదితరులు ఉన్నారు .
మరోవైపు, కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్జరీ ముగిసింది. దాదాపు నాలుగు గంటలపాటు సర్జరీ చేశారు. పేగుకు గాయం కావడంతో ఇన్ఫెక్షన్ సోకకుండా ఐసీయూలో ఆయనను వైద్యులు పర్య వేక్షిస్తున్నారు. సర్జరీ సమయంలో గాయం తీవ్రంగా ఉందని వైద్యులు గుర్తించారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు పేర్కొన్నారు.
గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదన్నారు. రక్తం అంతా కడుపులో పేరుకుపోయిందని తెలిపారు. లోపల రక్తం పేరుకుపోవడం, ప్రేగుకు నాలుగుచోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యం అయ్యిందన్నారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు వివరించారు. పది రోజులపాటు ఆస్పత్రిలోనే ప్రభాకర్ రెడ్డికి చికిత్స అందించనున్నారు వైద్యులు.

కాగా, దుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పూరంపల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రాజు అనే వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
దుబ్బాక బంద్
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో జరిగిన దాడికి నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రేపు అంటే మంగళవారం దుబ్బాక బంద్‌కు పిలుపునిచ్చాయి.












Click it and Unblock the Notifications