చంద్రబాబు, జగన్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ పాలమూరు నుంచి ఎంపీగా గెలిచి ఈ ప్రాంతానికి ఏం చేసారని నిలదీసారు. నాడు వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలిస్తుంటే కేసీఆర్ నోరెత్తలేదన్నారు. ఆ తరువాత జగన్ ను ప్రగతి భవన్ కు ఆహ్వానించి రాచ మర్యాదలతో.. పంచభక్ష్యాలతో విందు ఏర్పాటు చేసి మరీ రాయలసీమకు నీటిని తరలించుకునేందుకు అంగీకారం తెలిపారని ఆరోపించారు. నాటి పరిస్థితులే నేడు చంద్రబాబు తో నీటి పంచాయితీకి కారణమని రేవంత్ వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ - జగన్ తో కలిసి
ముఖ్యమంత్రి రేవంత్ నారాయణపేట పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బహిరంగ సభ లో తాజా నీటి వివాదంతో పాటుగా కేసీఆర్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో పోతిరెడ్డి పాడుకు క్రిష్ణా నీటిని తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదని వ్యాఖ్యానించారు. ఆ తరువాత జగన్ ఏపీ సీఎంగా ఉండగా ప్రగతి భవన్ లో సుదీర్ఘ సమావేశం నిర్వహించి..అక్కడే రాయలసీమ తరలించుకుపోయేందుకు బీజం పడిందన్నారు. పదేళ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే నేడు చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదని రేవంత్ చెప్పుకొచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా అంటే తొలి నుంచి కేసీఆర్ వివక్ష చూపించారని ఆరోపించారు.

రేవంత్ సవాల్
కేసీఆర్ పాలమూరు చెప్పి రాజకీయం చేసారని.. జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ కి పాలమూరు ప్రజలు ఎంపీ పదవీ ఇచ్చిన బిక్ష అన్నారు. ఇదే సభలో బీజేపీ, బీఆర్ఎస్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోడీ, కేసీఆర్ పరిపా లన పై చర్చ పెడదామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు, ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలన, 12నెలల తెలంగాణలో ప్రజా పాలన పై చర్చకు తాను సిద్దమని రేవంత్ ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరపున, బీఆర్ఎస్ నుంచి ఎవరొచ్చినా సరేనన్నారు. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరపున నేను వస్తా.. ఎక్కడైనా సరే చర్చిద్దామని..తాను ఓడిపోతే ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని రేవంత్ చెప్పుకొచ్చారు.
సత్తా చాటుదాం
కేసీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ గట్టిగా కొడతా అంటున్నాడు.. గట్టిగా కొట్టేది అంటే.. ఫుల్, హాప్ తప్ప ఏమి కొట్టలేరంటూ సీఎం రేవంత్ ఎద్దేవా చేసారు. తప్పులు చేస్తున్న కేటీఆర్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉండి తెలంగాణ పరువు తీసిన కవిత, అవినీతికి పాల్పడిన హరీష్ ను కొట్టి...బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం.. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మహబూబ్ నగర్ లో ప్రాజెక్టులు పూర్తి చేసుకొందామని.. కొత్త పరిశ్రమ లకు భూములు ఇచ్చే వారికి ఎలాంటి నష్టం లేకుండా తాను బాధ్యత తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని రేవంత్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications