రైతుబంధు నిధుల చెల్లింపు పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!
రైతుబంధు నిధుల చెల్లింపు పైన ముఖ్యమంత్రి రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేసారు. ఇతర చెల్లింపులను నిలుపుదల చేసి రైతుబంధుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మొత్తం 69 లక్షల రైతులకు అందాల్సిన రైతుబంధు నిధులు ఇప్పటి వరకు 46 లక్షల మంది రైతులకు చెల్లించినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ 2,450 కోట్లు జమ అయ్యాయి. ఈ నెలాఖరు లోగా అయిదెకరాల కేటగిరీ వరకూ పూర్తి చేయాలని నిర్ణయించారు.
సీఎం తాజా ఆదేశాలు
రైతుబంధు నిధుల చెల్లింపు ఆలస్యం అవుతోంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలోనే సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇతర చెల్లింపులు ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచి..రైతుబంధు నిధుల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఐదెకరాల వరకూ రైతుబంధు చెల్లింపులు పూర్తయ్యేదాకా ఇతర చెల్లింపులు నిలిపివేయాలని స్పష్టం చేసారు. రైతుబంధుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 69 లక్షల మంది పట్టాదారులు ఉండగా.. వారికి ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు ఒక సీజన్‌కు రూ.7,625 కోట్లు అవసరమవుతున్నాయి. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు చెల్లింపులను రాష్ట్ర సర్కారు డిసెంబరులో ప్రారంభించింది.

46 లక్షల మందికి చెల్లింపు
ప్రభుత్వం ముందుగా తొలుత ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు నగదు బదిలీ చేయాలని, ఆ తర్వాత క్రమంగా విస్తీర్ణం పెంచుకుంటూ.. నిధులు సర్దుబాటు చేసుకుంటూ చెల్లింపులు చేయాలని సీఎం ఆదేశించారు. కానీ, నిధుల కొరతతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకూ 49 లక్షల ఎకరాలకుగాను 46 లక్షల మంది రైతులఖాతాల్లో రూ.2,450 కోట్లు జమ చేశారు. ఇంకా 23 లక్షల మంది రైతులకు రూ.4,170 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 2- 3 ఎకరాల కేటగిరీలో ఉన్న రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సన్నకారు రైతులు(3 ఎకరాల దాకా భూమి ఉన్నవారు) సుమారు 48 లక్షల మంది ఉన్నారు. వారిలో 46 లక్షల మందికి చెల్లింపులు పూర్తయ్యాయి.
వచ్చే నెలాఖరుకు పూర్తి
మరో రెండు లక్షల మంది రైతులకు నగదు బదిలీచేస్తే.. 3 ఎకరాల వరకూ చెల్లింపులు దాదాపుగా పూర్తవుతాయి. ఆ తర్వాత నాలుగెకరాలు, ఐదెకరాల వరకూ కూడా చెల్లింపులు పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐదెకరాలకు మించి విస్తీర్ణం ఉన్న రైతులకు ఫిబ్రవరిలో చెల్లింపులు చేసే చాన్స్ ఉంది. ఉద్యోగుల వేతనాలు చెల్లించిన తర్వాత నిధులు సర్దుబాటు చేసుకొని మిగిలిన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేలా ఆలోచన చేస్తున్నారు. దీని ద్వారా ఫిబ్రవరి మాసాంతానికి మొత్తంగా రైతుబంధు నిధులు పూర్తిగా జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎకరం, రెండెకరాలలోపు పొలం ఉన్న రైతుల్లో కొందరికి రైతుబంధు పడలేదనే ఫిర్యాదులు పైనా అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications