ఎంతమాత్రం సహించను- తేల్చి చెప్పిన రేవంత్: సరెండర్ కు ఆదేశాలు
బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇతర నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హెచ్‌ఎండీఏ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డ్ నౌ పథకం కింద హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ జాప్యం చోటు చేసుకుంటోండాన్ని సహించబోమని హెచ్చరించారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆమోద ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు.
సెక్రటేరియట్‌లో హెచ్‌ఎండీఏ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అనుమతుల మంజూరు సకాలంలో జరగాలని, ఈ విషయంలో బిల్డర్లు, నిర్మాణదారులను వేధింపులకు గురి చేయకూడదని అన్నారు. దరఖాస్తులను అనవసర జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆమోద ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది బిల్డర్లు, దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలిగిస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ లోపాలకు బాధ్యులైన వారిని గుర్తించి, ఎలాంటి సంకోచం లేకుండా వారిని సరెండర్ చేయాలని హెచ్‌ఎండీఏ కార్యదర్శి కే ఇళంబరితిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, దీన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. అనుమతులు మంజూరు చేయడంలో పారదర్శకమైన ప్రక్రియ అవసరమని తేల్చి చెప్పారు.
హెచ్‌ఎండీఏ పరిధిలోని సరస్సులు, నాలాలు, ఇతర జలవనరులపై తక్షణమే లిడార్ సర్వే చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తే, ఆక్రమణలు లేదా క్లియరెన్స్‌లకు సంబంధించిన వివాదాలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడానికి జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ శాఖ అధికారులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ కార్యదర్శికి సూచించారు.
నగరంలో అభివృద్ధి, నిర్మాణ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమీక్షించి, అనుమతులు త్వరగా జారీ చేయాలని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు అనుమతులు మెరిట్ ఆధారంగా, కృత్రిమ అడ్డంకులు లేకుండా ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.












Click it and Unblock the Notifications