ఊపందుకోనున్న RRR, నాగ్‌పూర్-విజయవాడ కారిడార్ పనులు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రీజినల్ రింగ్ రోడ్(RRR), ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. తెలంగాణ మణిహారం రీజినల్ రింగ్ రోడ్ (RRR)కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇందుకోసం అటవీ - ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు
చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రాలకు కచ్చితంగా బీటీ రోడ్లు ఉండాల్సిందేనని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీలైనంత వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక ఏ గ్రామానికి రోడ్డు లేదు అనే మాట వినబడొద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరోవైపు, రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యెలు నాయిని రాజేందర్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications