ఆయనకు భారతరత్న కోసం చేయాల్సిందంతా చేస్తా: రేవంత్
Revanth Reddy: హైదరాబాద్ బంజారాహిల్స్ లో కొత్తగా నిర్మించిన ఏఐజీ ఆసుపత్రి భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం ఆయన మట్లాడారు. వైద్యరంగంలో ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరించారు. మెడికల్ టూరిజానికి హైదరాబాద్ హబ్ గా మారిందని పేర్కొన్నారు.
ఫార్మా సూటికల్స్ రంగంలో హైదరాబాద్ ఇప్పటికే అత్యుత్తమ నగరంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు కోవిడ్ వ్యాక్సిన్లు ఇక్కడే తయారయ్యాయనీ గుర్తు చేశారు. 1961లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఐడీపీఎల్ ఏర్పాటు చేసిందని, దాని వల్లే ఫార్మారంగంలో హైదరాబాద్ అగ్రస్థానానికి ఎదిగిందని అన్నారు.

దాదాపుగా 66 దేశాల నుంచి వ్యాధిగ్రస్తులు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కు వస్తోన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే వందేళ్లల్లో తెలంగాణ సాధించాల్సిన పురోగతిపై ఓ విజన్ డాక్యుమెంట్ తయారు చేయనున్నామని, ఇందులో హెల్త్ టూరిజానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని చెప్పారు.
ఈ హెల్త్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దడంలో భాగంగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని హెల్త్ అడ్వైజర్ గా అపాయింట్ చేశామని ఆయన పేర్కొన్నారు. హెల్త్ విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేయడంలో సహకరించాలని, ఇందులో భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని రేవంత్ గుర్తు చేశారు. పేదల వైద్యానికి తమ ప్రభుత్వం వెనుకాడట్లేదని, తమ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 1,400 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేశామని అన్నారు.
మహిళలు అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్న నేపథ్యంలో- దీన్ని పరిష్కరించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. స్వయం సహాయక గ్రూపుల్లో ఉండే మహిళలందరికీ హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేయనున్నామని అన్నారు. మారుమూల గ్రామాల్లో ఉండే మహిళలు సైతం ఈ యూనిక్ కార్డు ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పొందగలుగుతారని చెప్పారు.
గతంలో ఆ మహిళ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంది?, ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ ఏమిటీ?, ఇప్పుడు అందించాల్సిన వైద్యం ఎలాంటిది? అనేది తెలుసుకోవడం డాక్టర్లకు సులభతరమౌతుందని అన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుల వల్ల నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించవచ్చని చెప్పారు.
చావడానికే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నామనే అభిప్రాయాల నుంచి ప్రజలను దూరం చేయాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, విద్యకు రూ. 21,500 కోట్లు, వైద్యానికి 11,500 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించామని వివరించారు.
సామాజిక బాధ్యతగా డాక్టర్లు సంవత్సరంలో ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. 11 నెలలు తమకు ఇష్టమైన చోట, ఇష్టమైన జీతాన్ని తీసుకోవచ్చని, మిగిలిన ఆ ఒక్క నెల మాత్రం రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపిక చేసుకుని, అక్కడికి వెళ్లి పేదలకు వైద్యాన్ని అందించాలని కోరారు.
విదేశాల్లో నివసించే తెలంగాణకు చెందిన డాక్టర్లు.. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క వారం రోజులైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సేవలను అందించాలని రేవంత్ రెడ్డి సూచించార. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచలను ఇవ్వొచ్చనీ చెప్పారు.
వైద్యరంగంలో ఎంతో సేవలను అందిస్తూ వచ్చిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిందని, ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందజేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న పురస్కారం కోసం ఒక ముఖ్యమంత్రిగా, ప్రభుత్వం తరఫు నుంచి అవసరమైన ప్రయత్నాలు చేస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications